టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ నేరం చేశారట. ఆ నేరంలో మరో క్రికెటర్ కి భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. తన క్రైమ్ పార్ట్ నర్ ఇతనే అంటూ ఓ ఫోటో పోస్టు చేశాడు. కాగా... కోహ్లీ పోస్టు చేసిన ఆ ఫోటో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... వర్షం లో కోహ్లీ తడుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో ధోనీ వెనక నుంచి నిలబడి ఉన్నారు. ‘నా నేరంలో భాగస్వామి.. బౌండరీ వద్ద ఫీల్డర్ల నుంచి సింగిల్స్ స్థానంలో డబుల్స్ దోచుకున్నాం. అతను ఎవరో తెలుసా..?’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు.

కాగా... ఆ పోస్టుకి నెటిజన్ల స్పందన చాలా పాజిటివ్ గా ఉంది. కామెంట్ల వర్షం కురిపించారు. ఆ ఫోటోలో ఉంది ధోనీ అంటూ నెటిజన్లంతా ముక్త కంఠంతో పేర్కొన్నారు. మరికొందరేమో.. ధోనీ తిరిగి జట్టులోకి రాబోతున్నాడని.. వెస్టిండీస్ మ్యాచ్ లో ధోనీ ఆడబోతున్నాడంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.

వెస్టిండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ల కోసం గురువారం జట్లను ప్రకటించే అవకాశం ఉంది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్  నేతృత్వంలోని సెలక్టర్ల కమిటీ ఈరోజు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమై.. జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫోటో పోస్టు చేయడంతో.. జట్టులో ధోనీకి మళ్లీ అవకాశం ఇస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.