టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. త్వరలోనే తండ్రికాబోతున్నాడు. ఈ విషయాన్ని విరుష్క జోడి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా.. ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయి వెళ్లిన కోహ్లీ.. ఆర్సీబీ  యూట్యూబ్ ఛానెల్ ఆర్సీబీ డైరీస్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. దానిలో భాగంగా.. తండ్రి కాబోతున్నారన్న విషయం తెలియగానే ఎలా ఫీలయ్యారని అడగగా.. దానికి కోహ్లీ సమాధానం ఇచ్చాడు.

‘ అదో అనిర్వచనీయమైన అనుభూతి. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ వార్త తెలిశాక మేము మేఘాల్లో తేలిపోయాం’ అంటూ  కోహ్లీ పేర్కొన్నాడు. ఈ న్యూస్ ని అందరితో పంచుకున్న తర్వాత అభిమానులు చూపించిన ప్రేమ వెలకట్టలేనిదన్నాడు. తమ మధ్యలోకి మూడో వ్యక్తి రాక కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు  చెప్పాడు.

ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్ 13 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు. దీంతో.. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని ఈ జట్టు చాలా గట్టి పట్టుదలతో ఉంది.