ఆసీస్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ‘నాటు నాటు’ డ్యాన్స్... ట్వీట్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్..
స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ ‘నాటు నాటు’ పాట స్టెప్పులు వేసిన విరాట్ కోహ్లీ... సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆర్ఆర్ఆర్ టీమ్..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉంటే అభిమానులకు పండగే. బ్యాటింగ్‌లో క్లాస్ షాట్స్, ఊర మాస్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను అలరించే విరాట్ కోహ్లీ, ఫీల్డింగ్ చేసే సమయంలోనూ ఏ మాత్రం ఖాళీగా ఉండడు. అప్పుడప్పుడూ తన స్టైల్‌లో బాంగ్రా డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులకు వినోదాన్ని పంచే విరాట్ కోహ్లీ, ట్రెండింగ్‌లో ఉన్న పాటలకు స్టెప్పులు వేస్తూ ఉంటాడు...
బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ సమయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి షారుక్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘పఠాన్’ పాటకు స్టెప్పులు వేసిన విరాట్ కోహ్లీ.. తాజాగా వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు’ పాట స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచాడు..
స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో వరల్డ్ ట్రెండింగ్ ‘నాటు-నాటు’ స్టెప్పులు వేయడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోని ఓ అభిమాని, ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, దీనికి ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ టీమ్ స్పందించింది..
విరాట్ కోహ్లీని ట్యాగ్ చేసి... ‘నాటు నాటు’ హ్యాష్ ట్యాగ్‌ని జోడించిన ఆర్ఆర్ఆర్, లవ్ ఎమోజీని జత చేసింది. అయితే ఆ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో, కాపీ రైట్స్ కారణంగా డిసేబుల్ అయ్యింది...
అయితే ఇన్‌స్టాలో వీడియో పోస్టు చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ, గత ఏడాది ఐపీఎల్ సమయంలో విడుదలై అఖండ విజయం సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేనియా కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ అనుకున్నంతగా జనాల్లోకి వెళ్లలేకపోయింది.
ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘ఆస్కార్’ అవార్డు అందుకుంది. ఈ కేటగిరిలో ఆస్కార్ గెలిచిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ‘RRR’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది..
ఆస్కార్ వీక్‌లో ఎక్కువగా డిస్కర్షన్‌లోకి వచ్చిన నటుడిగా టాప్‌లో నిలిచాడు ఎన్టీఆర్. హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రెండర్ ఫ్రేజర్, పెడ్రో పాస్కల్‌ని పక్కననెట్టి ఎన్టీఆర్, టాప్ 1లో నిలవగా రామ్ చరణ్ రెండో స్థానంలో నిలిచాడు...
ఆస్కార్స్ సమయంలో #Oscars హ్యాష్ ట్యాగ్‌తో 3.4 మిలియన్ల ట్వీట్స్ రాగా, అందులో జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రస్తావిస్తూ 1.05 మిలియన్ల ట్వీట్లు పోస్టు కావడం విశేషం. మరోవైపు ఆసియాలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుడిగా, సెలబ్రిటీగా టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ మైదానంలో నాటు నాటు స్టెప్పులు వేయడంతో తెలుగు సినిమా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు..
అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో 186 పరుగులు చేసి, టెస్టుల్లో 28వ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో విరాట్‌కి ఇది 75 వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ మాత్రమే 100 అంతర్జాతీయ సెంచరీలతో విరాట్ కోహ్లీ కంటే ముందున్నాడు..