World's Top-10 Highest Paid Athletes: ఫామ్ శాశ్వతం కాదు క్లాస్ శాశ్వతం అంటారు క్రికెట్ పండితులు. రెండున్నరేండ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నా కోహ్లి బ్రాండ్ విలువ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. టీమిండియా అతడు సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి..
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి గత రెండున్నరేండ్లుగా ఫామ్ కోల్పోయి మునపటి ఆటను అందుకోలేక నానా తంటాలు పడుతున్నాడు. తన కెరీర్ లో సెంచరీ చేయక రెండేండ్లు దాటింది. టీమిండియా కెప్టెన్సీ పోయింది. ఐపీఎల్ లో కూడా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ సీజన్ లో కోహ్లి ఆట అత్యంత అద్వాన్నంగా ఉంది. అయితే ఇవేవీ కోహ్లి బ్రాండ్ ఇమేజ్ ను తక్కువ చేయలేదు. ఇప్పటికీ భారత్ లో అత్యంత సంపాదన కలిగిన ఆటగాళ్లలో కోహ్లి యే నెంబర్ వన్. వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ టాప్-100 అథ్లెట్ల జాబితాలో కోహ్లి 61 వ స్థానంలో ఉండగా.. భారత్ నుంచి మాత్రం ఒకే ఒక్కడు. మరే ఆటగాడికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.
2021-22 సంవత్సరానికి గాను అత్యధిక రాబడి కలిగిన ఆటగాళ్ల జాబితాను స్పోర్టికో విడుదల చేసింది. ఈ జాజితాలో ఫుట్బాల్, ఎన్బీఏ స్టార్లదే హవా. ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ లీబ్రాన్ జేమ్స్ 126.9 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఫుట్బాల్ దిగ్గజాలు లియోనల్ మెస్సీ (122 మిలియన్ డాలర్లు) , క్రిస్టియానో రొనాల్డో (115 మిలియన్ డాలర్లు), నెయిమేర్ (103 మిలియన్ డాలర్లు) రెండు నుంచి నాలుగు స్థానాలు ఆక్రమించారు. ఇక ఈ జాబితాలో ఐదో స్థానంలో ప్రొఫెషనల్ బాక్సర్ కెనెలో అల్వారెజ్ (89 మిలియన్ డాలర్లు), 8వ స్థానంలో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ (85.7 మిలియన్ డాలర్లు), 10వ స్థానంలో గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ (73.5మిలియన్ డాలర్లు) నిలిచారు.
విరాట్ కోహ్లి ఈ జాబితాలో 61 వ స్థానంలో నిలిచాడు. అతడి సంపాదనను 33.9 మిలియన్ డాలర్లు గా లెక్కగట్టారు. టాప్-100 లో కోహ్లి తప్ప మరే భారతీయ ఆటగాడికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.
