Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం... టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన...

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విరాట్ కోహ్లీ...

Virat Kohli has stepped down as the Test captain of Team India
Author
India, First Published Jan 15, 2022, 6:51 PM IST

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, టెస్టుల నుంచి తప్పుకోవడంతో ఓ శకం ముగిసినట్టైంది...
 

2014లో ఎమ్మెస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ, గత ఐదేళ్లుగా భారత జట్టును ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1గా నిలిపాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అద్భుతమైన విజయాలు అందుకున్న భారత టెస్టు జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 ఫైనల్‌కి అర్హత సాధించింది...

68 టెస్టు మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, 40 విజయాలు అందించి, అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్ల జాబితాలో టాప్ 4లో ఉన్న విరాట్ కోహ్లీ, మరో టెస్టు విజయాన్ని అందుకుని ఉంటే... టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చేవాడు...

ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లాండ్ టూర్‌లో అదిరిపోయే విజయాలు అందుకుని అబ్బురపరిచిన విరాట్ కోహ్లీ, సడెన్‌గా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది... 


‘జట్టును సరైన దిశలో నడిపించడానికి ఏడుళ్లుగా ఎంతో కఠినంగా శ్రమిస్తూ వచ్చాను. టీమిండియా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూర్తి నిజాయితీతో నిర్వహించాను. భారత జట్టు కెప్టెన్‌గా ఒకానొక దశలో ఎన్నో అడ్డుగోడలను అధిగమించాను. ఇక సమయం వచ్చేసింది. నా జర్నీలో ఎన్నో విజయాలు చూశాను, మరెన్నో పరాజయాలు కూడా. అయితే ఎప్పుడూ ప్రయత్నాన్ని వదిలింది లేదు. పూర్తి నమ్మకంతో 100కి 120 శాతం శ్రమించాను. 

టీమ్‌కి ఏది కరెక్ట్ కాదో, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నా జట్టు గౌరవాన్ని తగ్గించే పని ఏదో నాకు పూర్తి క్లారిటీ ఉంది. నా దేశాన్ని నడిపించే బాధ్యత అందించిన బీసీసీఐకి ధన్యవాదాలు... ఇన్నేళ్ల పాటు నాకు తోడుగా నిలిచిన నా ప్రతీ టీమ్‌ మేట్‌కి థ్యాంక్స్... మీరంతా కలిసి నా ఈ ప్రయాణాన్ని అత్యంత సుందరంగా, మధురంగా మలిచారు. 

రవి భాయ్ (రవిశాస్త్రి), సపోర్ట్ స్టాఫ్‌, టెస్టు క్రికెట్‌లో ఇంజన్‌లా ఉండి బండిని వెనక నుంచి నడిపించారు. చివరగా నన్ను నమ్మి కెప్టెన్‌గా నన్ను రిఫర్ చేసిన ఎమ్మెస్ ధోనీ... ఓ బిగ్ థ్యాంక్ యూ.... ’ అంటూ తన లేఖలో రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ... 

విరాట్ లేఖలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కానీ, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకపోవడం...మ ాజీ కోెచ్ రవిశాస్త్రి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పడంతో భారత క్రికెట్ బోర్డుతో కోహ్లీకి విభేదాలున్నాయనే వాదనకు మరింత ఊతం చేకూర్చినట్టైంది... 

కేప్ టౌన్ టెస్టులో విరాట్ కోహ్లీ స్టంప్ మైక్‌లో మాట్లాడుతూ థర్డ్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అండ్ కో సీరియస్ అయ్యారని, అందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి...

Follow Us:
Download App:
  • android
  • ios