కీలక టోర్నీలలో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నా కోహ్లీకి అది అందని ద్రాక్షేనా.. ఈ విషాదానికి అంతే లేదా..?
T20 World Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశే మిగిలింది. భారీ టోర్నీలలో టన్నుల కొద్దీ పరుగులు చేసినా కోహ్లీకి భంగపాటు తప్పడం లేదు. ఎన్ని కీలక ఇన్నింగ్స్ ఆడినా ఐసీసీ ట్రోఫీ దక్కడం లేదు.
ఆధునిక క్రికెట్ లో విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో వేలాది పరుగులు సాధించిన ఈ రన్ మిషీన్ కు ఐసీసీ టోర్నీ దక్కించుకునే అదృష్టం మాత్రం లేనట్టుంది. ధోని సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీకి ప్రతీ ఐసీసీ టోర్నీలోనూ భంగపాటు తప్పడం లేదు. ఈ టోర్నీలలో ఆడకుండా ఓడినా ఏదైనా అందామంటే.. ప్రతీ టోర్నీలోనూ చెలరేగే కోహ్లీకి మరోసారి తీవ్ర నిరాశే మిగిలింది. గతంలో కెప్టెన్ గా నిరాశచెందిన కోహ్లీ ఇప్పుడు ఆటగాడిగానూ బాధపడుతున్నాడు.
2022 టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ.. 296 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు అతడే. నాలుగు హాఫ్ సెంచరీలు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఓ చిన్నపాటి యుద్ధమే చేశాడు కోహ్లీ. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్.. ఇలా ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ రాణించాడు. కానీ చివరకు మిగిలింది...!
వన్డే ప్రపంచకప్ ల సంగతి పక్కనబెడితే టీ20 ప్రపంచకప్ లలో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 2014 టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ.. 319 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 2016లో 273 రన్స్ చేశాడు. తాజాగా 296 పరుగులు చేశాడు. 2014లో భారత్ ఫైనల్ లో ఓడింది. 2016లో సెమీస్ లో, 2022లోనూ సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టింది. దీంతో కోహ్లీ అభిమానులు అతడికి ఐసీసీ టోర్నీని మళ్లీ నెగ్గే అదృష్టం లేనట్టుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు కోహ్లీ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో ఏకంగా 1100 కు పైగా పరుగులు చేశాడు. ఈ దరిదాపుల్లో కూడా ఇప్పుడు టాప్-10 లో ఉన్న క్రికెటర్లలో రోహిత్ శర్మ మినహా మరెవరూ లేరు. వచ్చే ప్రపంచకప్ (2024) లో రోహిత్ ఆడేది అనుమానమే. దీంతో కోహ్లీ రికార్డుకు ఇప్పట్లో వచ్చిన చిక్కేమీ లేదు.
టీ20లలో అరుదైన రికార్డు..
టీ20 క్రికెట్ లో కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఫార్మాట్ లో 4 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు టీ20లలో 4 వేల మైలురాయిని టచ్ చేసిన ఆటగాడు కోహ్లీ ఒక్కడే. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరుకోగానే అతడు.. ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే..
- విరాట్ కోహ్లీ (115 మ్యాచ్ లలో 4008)
- రోహిత్ శర్మ (148 మ్యాచ్ లలో 3,853)
- మార్టిన్ గప్తిల్ (122 మ్యాచ్ లలో 3,531)
- బాబర్ ఆజమ్ (98 మ్యాచ్ లలో 3,323)
- పీఆర్ స్టిర్లింగ్ (121 మ్యాచ్ లలో 3,181)
- ఆరోన్ ఫించ్ (103 మ్యాచ్ లలో 3,120)
- డేవిడ్ వార్నర్ (99 మ్యాచ్ లలో 2,894)