ముంబై: ఐసీసి మహిళా టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఫైనల్ చేరుకున్న భారత మహిళా జట్టును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిందించాడు. సెమీ ఫైనల్ కు చేరిన హర్మాన్ ప్రీత్ కౌర్ జట్టుపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇంగ్లాండుపై జరగాల్సిన సెమీ ఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో లీగ్ దశలో సాధించిన పాయింట్ల ఆధారంగా భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. మహిళల జట్టు టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఫైనల్ కు చేరుకోవడం ఇదే మొదటిసారి. 

ఫైనల్ కు చేరుకున్న మహిళా జట్టును విరాట్ కోహ్లీ అభినందిస్తూ ఫైనల్లోనూ అదృష్టం కలిసి రావాలని ఆశించాడు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభినందలను తెలిపాడు. 

 

టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా మహిళా జట్టును అభినందించాడు. "టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లోకి చేరిన భారత మహిళల జట్టుకు అభినందనలు. గుడ్ లక్, కప్ ను దేశానికి తీసుకుని రండి" అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు.

 

ఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టును క్రికెటర్ సురేష్ రైనా కూడా అభినందించాడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు చేరినందుకు అభినందనలు అని, ఫైనల్ మ్యాచులో విజయం సాధించాలని ఆశిస్తున్నానని, అద్భుతమైన విజయం ముందు ఉందని ఆయన అన్నాడు.

 

హైదరాబాదీ మాజీ క్రికెటర్ వివీయస్ లక్ష్మణ్ కూడా మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు. గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచులు గెలిచినందుకు ఇది రివార్డు అని, ఫైనల్స్ లో విజయం సాధించాలని కోరుతున్నానని అంటూ వుమెన్స్ డే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. 

 

మహిళల జట్టును అభినందిస్తూ ప్రతి భారతీయుడిని గర్వంగా ఫీలయ్యేట్లు చేశారని టీమిడియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఫైనల్స్ లో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 

 

మ్యాచు జరగకపోవడం దురదృష్టకరమని, కానీ నిబంధలను పాటించాల్సిందేనని, భవిష్యత్తులోనైనా రిజర్వ్ డే పెడితే మంచిదని హర్మాన్ ప్రీత్ కౌర్ అన్నారు. భారత్ ఫైనల్ ల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.