Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: సూర్య బాదుడుకు విరాట్ వందనం.. మిస్టర్ 360 ఆటకు ఫిదా

Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్ తో ముగిసిన మ్యాచ్ లో భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 

Virat Kohli Bows Down to Suryakumar Yadav after Mumbaikar Spectacular Knock against Hongkong
Author
First Published Aug 31, 2022, 11:42 PM IST

హాంకాంగ్‌తో మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్‌ను రెండు భాగాలుగా విభజిస్తే అది సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రాకముందు, వచ్చిన తర్వాత అని చెప్పాలి. కెఎల్ రాహుల్ ఔటయ్యాక 14వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన నయా మిస్టర్ 360.. రావడం రావడమే బాదుడు మంత్రాన్ని వాడాడు. యసిమ్ ముర్తజా వేసిన 14వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో తాను ఏం చేయబోతున్నాననేది హాంకాంగ్ ఆటగాళ్లకు స్పష్టంగా చెప్పాడు. ఇక ఆ తర్వాత రచ్చ మాములుగా లేదు. సూర్య వచ్చేవరకు నిదానంగా ఆడిన  కోహ్లీ కూడా అతడొచ్చాక గేర్ మార్చాడు. భారత ఇన్నింగ్స్ ముగిశాక కోహ్లీ.. సూర్య ఆటకు ఫిదా అయ్యాడు. 

భారత్ ఇన్నింగ్స్ లో 20వ ఓవర్ లో  సూర్యకుమార్ వీరవిహారం చేశాడు. హరూన్ అర్షద్ వేసిన ఆ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో కోహ్లీ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. భారత ఇన్నింగ్స్ ముగిశాక సూర్య దగ్గరికి వచ్చి ‘టేక్ ఏ బౌ’ అంటూ అతడి ఆటకు ఫిదా అయ్యాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ మ్యాచ్ లో సూర్య.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  మొత్తంగా 26 బంతుల్లోనే 6 బౌండరీలు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి హాంకాంగ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ లో సూర్య స్ట్రైక్ రేట్ ఏకంగా 261.54గా ఉండటం గమనార్హం. సూర్య రాకముందు భారత స్కోరు 13 ఓవర్లకు 94 పరుగులే ఉండేది. కానీ చివరి ఏడు ఓవర్లలో భారత్.. ఏకంగా 98 పరుగులు సాధించింది. అందులో 68 సూర్యవే కావడం  విశేషం. 

 

ఈ మ్యాచ్ లో సూర్యతో పాటు విరాట్ కూడా రాణించాడు. టీ20లలో అతడు 31వ హాఫ్ సెంచరీ సాధించాడు.  నెలరోజుల విరామం తర్వాత బ్యాట్ పట్టిన కోహ్లీ.. పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఫర్వాలేదనిపించాడు. హాంకాంగ్ తో మ్యాచ్ లో అర్థ సెంచరీ సాధించి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకున్నాడు. 

భారత్-హాంకాంగ్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి  తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ  అదరగొట్టారు. ఆ తర్వాత హాంకాంగ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios