ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దానిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే... ఈ లాక్ డౌన్ ఇంటికి పరిమితమైన భర్తలు.. భార్యలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి.

వీటిపై ఇటీవల భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఘాటుగా స్పందించగా.. తాజాగా విరుష్క జోడి స్పందించారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు.

‘మీరు గృహ హింసకు గురౌతున్నా.. లేదా ఎవరైనా గురౌతుంటే మీరు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నా, లేదా దాని నుంచి బయటపడినవారైతే వెంటనే ఈ విషయం తెలియజేయండి’ అంటూ వీడియో షేర్ చేశారు.

ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, రోహిత్ శర్మ, మిథాలీరాజ్, కరణ్ జోహార్ , మాధురీ దీక్షిత్, పర్హాన్ అక్తర్, తదిరతులు ఉన్నారు. వారంతా గృహ హింసకు గురౌతున్నావారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వెంటనే ఫిర్యాదు చేయమని సూచించారు.

ఇలాంటి ఘటనలపై ప్రతి ఒక్కరూ నోరు విప్పాలని సూచించారు. పురుషులు సైతం అండగా నిలబడాలని సూచించారు. ఇదిలా ఉండగా.. మూడు రోజుల క్రితం సానియా మీర్జా కూడా ఈ ఘటనలనపై స్పందించారు.

"లాక్ డౌన్ సందర్భంగా మహిళలపై దాడులు, గృహ హింస పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు నా దృష్టికీ వచ్చాయి. దీన్ని నేను ఎల్లప్పుడూ ఖండిస్తాను. గృహ హింస అనేది ఒక అసంబద్ధమైన విషయం. లాక్ డౌన్ రోజుల్లో పురుషులు, మహిళలు అందరూ సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచనా ధోరణి మారితే చాలు. అయితే తమకు లభించాల్సిన గౌరవం కోసం శాసించి, సాధించాల్సిన బాధ్యత మహిళలపైనే ఉంది" అని సానియా మీర్జా అభిప్రాయపడ్డారు.