పాకిస్తాన్‌ నుంచి దుబాయ్ చేరుకున్న ఇద్దరు అభిమానులు... వారిని కలిసి ఫోటో దిగిన విరాట్ కోహ్లీ... 

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే విరాట్‌కి భారత్‌లో ఉన్న అభిమానుల సంఖ్య కంటే విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ సంఖ్యే ఎక్కువ. విరాట్ ఆటతీరుని, అతని యాటిట్యూడ్‌ని అంతలా ఇష్టపడతారు క్రికెట్ ఫ్యాన్స్. పొరుగుదేశం పాకిస్తాన్‌లో కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు...

విరాట్ మీద అభిమానంతో తన ఇంటి మీద భారత జాతీయ జెండా ఎగరవేసి ఓ అభిమాని, జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. యూఏఈలో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీని కలిసేందుకు పాకిస్తాన్ నుంచి చాలామంది ఫ్యాన్స్, దుబాయ్‌కి వచ్చారు... వారిలో ఇద్దరికి విరాట్ కోహ్లీని కలిసే అవకాశం దక్కింది...

Scroll to load tweet…

పాక్‌కి చెందిన కుర్రాడు, విరాట్ కోహ్లీని కలిసేందుకు ఏకంగా సెక్యూరిటీని దాటుకుని భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న నెట్ సెషన్స్‌ దగ్గరికి వెళ్లాడు. ఆకస్మాత్తుగా బయటి వ్యక్తి అక్కడికి రావడంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది... అతన్ని అడ్డుకున్నారు. సెక్యూరిటీ పట్టుకుని తీసుకెళ్తున్న సమయంలో అతను అరుస్తూ, కేకలు వేశాడు... 

‘నేను పాకిస్తాన్‌కి చెందిన వాడిని. విరాట్ కోహ్లీ కోసమే ఇక్కడికి వచ్చాడు. ఒక్క ఫోటో ఇవ్వండి కోహ్లీ...’ అంటూ కేకలు వేశాడు. ఈ కేకలను విన్న విరాట్ కోహ్లీ, సెక్యూరిటీని వారించి అతనితో సెల్పీ దిగాడు. ఇలాంటి సందర్భాల్లో పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అలాంటి ఉద్రేకంతో నిండిన ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగడానికి ధైర్యం చేయరు. కానీ విరాట్ మాత్రం అతని ముచ్ఛట తీర్చి... పాక్ క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు...

‘నా జీవితంలో ఈ క్షణాలను ఎప్పుడూ మరిచిపోను. నేను విరాట్‌కి వీరాభిమానిని. ఆయన్ని కలవడానికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది.. విరాట్, పాకస్తాన్‌పై హాఫ్ సెంచరీ చేయాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశారు ఆ పాక్ అభిమాని... 

అలాగే పాకిస్తాన్‌కి చెందిన ఓ దివ్యాంగురాలు, విరాట్ కోహ్లీని కలిసేందుకు పాకిస్తాన్ నుంచి దుబాయ్‌కి చేరుకుంది. విరాట్‌ని కలిసేందుకు ఆమె రోజూ తన సహాయకురాలితో కలిసి టీమిండియా నెట్ ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియానికి వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విరాట్ కోహ్లీ స్వయంగా వెళ్లి, ఆమెతో ఫోటోలు దిగాడు. అంతేకాకుండా ఎలా ఉన్నారంటూ క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు...

‘విరాట్‌ కోహ్లీది చాలా మంచి మనసు. ఆయనే నన్ను స్వయంగా కలిసి ఫోటోలు దిగారు. ఎలా ఉన్నారని అడిగాడు... ’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది ఆ విరాట్ కోహ్లీ వీరాభిమాని. ఈ రెండు సంఘటనలను కూడా పాకిస్తాన్‌కి చెందిన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ వెలుగులోకి తేవడం విశేషం..