మొదటి వన్డేలో జాతీయ గీతం ఆలపిస్తుండగా ఇషాన్ కిషన్‌ని ఇబ్బంది పెట్టిన తుమ్మెద... చాకచక్యంగా దాని నుంచి తప్పించుకున్న యంగ్ బ్యాటర్..
ఇషాన్ కిషన్... ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత తన ముంబై ఇండియన్స్ టీమ్ మేట్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఒకే రోజు అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన క్రికెటర్. సూర్యకుమార్ యాదవ్ నిలకడైన పర్ఫామెన్స్‌తో వన్డే, టీ20 టీమ్‌ల్లో స్థిరమైన చోటు దక్కించుకుంటే... ఇషాన్ కిషన్ మాత్రం తన దూకుడు, నిలకడలేమి కారణంగా టీమ్‌లోకి వచ్చి పోతున్నాడు...
ఈ ఏడాది టీమిండియా తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్‌తో పోటీపడుతున్నాడు ఇషాన్ కిషన్. నెల రోజుల క్రితం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, కొన్ని రోజుల్లోనే మళ్లీ కిందకి పడిపోయాడు...
కెఎల్ రాహుల్ గాయపడడం, ఇషాన్ కిషన్ సరిగ్గా రాణించకపోవడంతో అతని స్థానంలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లను ఓపెనర్లు పంపి ప్రయోగాలు చేసింది భారత జట్టు. తాజాగా జింబాబ్వే జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇషాన్ కిషన్‌కి చోటు దక్కింది...
హరారేలో జరిగిన మొదటి వన్డే ఆరంభానికి ముందు యథావిథిగా ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలో వరుసగా నిలబడి జాతీయ గీతం ఆలపించారు. ఈ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ తుమ్మెద, ఏకాగ్రతగా జనగణ మన పాడుతున్న ఇషాన్ కిషన్ చెవుల్లోకి దూరేందుకు ప్రయత్నించింది. జువ్వుమని ఆ ఈగ చేసిన శబ్దానికి కళ్లు తెరిచిన ఇషాన్ కిషన్, వెంటనే కిందకి వంగి దాని నుంచి తప్పించుకున్నాడు...
ఇషాన్ కిషన్ పక్కనే ఉన్న కుల్దీప్ యాదవ్‌కి కూడా ఈ విషయం తెలియలేదు. తుమ్మెద వెళ్లిపోగానే మళ్లీ జాతీయ గీతం ఆలపించడంలో నిమగ్నమైపోయాడు ఇషాన్ కిషన్... ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ గీతం ఆలపిస్తుండగా ఈగలతో ఆడుకున్న ఇషాన్ కిషన్‌ని ‘యాంటీ నేషనల్’గా పరిగణించాలంటూ కొందరూ ఫన్నీగా పోస్టులు చేస్తున్నారు..
ఈ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఐపీఎల్ 2022కి ముందు గాయపడి, ఆరు నెలల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహార్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణలకు కూడా మూడేసి వికెట్లు దక్కాయి. మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశాడు...
190 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించేసింది భారత జట్టు. ఓపెనర్లు శిఖర్ ధావన్ 81, శుబ్‌మన్ గిల్ 81 పరుగులు చేసి టీమిండియాకి విజయాన్ని అందించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ వద్దామనుకున్న ఇషాన్ కిషన్‌కి బ్యాటింగ్‌కి రాలేదు.
అలాగే రెండు నెలల తర్వాత క్రికెట్ ప్రాక్టీస్ చేయాలని జింబాబ్వేకి బయలుదేరిన కెఎల్ రాహుల్‌కి కూడా బ్యాటింగ్ రాలేదు. అయితే సౌతాఫ్రికా టూర్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి చెత్త రికార్డు మూటకట్టుకున్న కెఎల్ రాహుల్‌కి ఎట్టకేలకు కెప్టెన్‌గా తొలి విజయం దక్కింది...
