గృహహింస వద్దు: భార్యకు శిఖర్ ధావన్ బాక్సింగ్ శిక్షణ వీడియో వైరల్
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ట్విట్టర్ లో సందేశాత్మక పోస్టును పెట్టాడు. లాక్ డౌన్ నేపథ్యంలో గృహహింస పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇది చాలా బాధాకరమని శిఖర్ ధావన్ అన్నాడు.
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ట్విట్టర్ లో సందేశాత్మకమైన పోస్టును పెట్టాడు. మహిళలపై జరుగుతున్న గృహహింసకు స్వస్తి చెప్పాలని ఆయన సూచించాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ధావన్ తన ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టాడు.
తన భార్య అయేషా ముఖర్జీ, కుమారుడు జోరవర్ కు అతను బాక్సింగ్ లో శిక్షణ ఇచ్చాడు. కుటుంబంతో కలిసి సమయాన్ని బాగా ఆస్వాదిస్తున్నానని, అయితే, ఈ రోజుల్లో కూడా కొందరు గృహహింసకు పాల్పడుతున్నట్లు తెలిసి ఎంతో బాధపడుతున్నానని, దాన్ని మనం అంతం చేయాలని అంటూ భాగస్వామితో దయ, ప్రేమలతో ఉండాలని, గృహహింసను మానండని ఆయన సూచించాడు.
భార్యకు బాక్సింగ్ లో శిక్షణ ఇస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఆ వీడియో 47 సెకన్ల నిడివి ఉంది. భార్యకు, కుమారుడికి పంచ్ లు కొట్టడం ఎలా చూపించిన దృశ్యం వీడియోలో ఉంది. అభిమానులు శిఖర్ ధావన్ పోస్టుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.