లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ గెలిచే సమయం అసన్నమైందని ఆ ఫ్రాంచైజీ మాజీ యజమాని, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా అన్నారు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ ను గెలుచుకోలేదు. ఐపిఎల్ 13వ ఎడిషన్ కు జట్టు సభ్యులు సన్నద్ధమవుతున్న తరుణంలో మాల్యా ట్విట్టర్ వేదికగా ఆ వ్యాఖ్యలు చేసారు. 

ఆర్సీబీ శుక్రవారంనాడు కొత్త లోగోను ఆవిష్కరించడంపై మాల్యా ట్విట్టర్ లో స్పందించారు. క్రికెట్ ను అమితంగా ఇష్టపడే మాల్యా ఆర్సీబీ ట్వీట్టలపై ఎల్లవేళలా తనదైన శైలీలో స్పందిస్తూనే ఉంటారు. కొత్త లోగో ఆవిష్కరణపై కూడా అలాగే స్పందించారు. సింహంలా గర్జించండి.. కానీ ఐపిఎల్ ట్రోఫీని బెంగళూరుకు తీసుకుని రండి అంటూ వ్యాఖ్యానించారు.

అండర్ 19 జట్టు నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్రాంచైజీలో అడుగు పెట్టాడని, భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడని ఆయన అన్నారు. ఓ ఆటగాడిగా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని ఆయన అన్నారు. 

అంతా కోహ్లీకి వదిలేయండని, పూర్తి స్వేచ్ఛనివ్వండి అని ఆయన ఫ్రాంచైజీ యజమానులకు సూచించాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఐపిఎల్ ట్రోఫీ గెలువాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.