త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం...145 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 156 పరుగులు చేసిన తిలక్ వర్మ...5 వికెట్లు తీసిన చామా మిలింద్..

విజయ్ హాజారే ట్రోఫీ 2021లో హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో గెలిచింది హైదరాబాద్. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.

కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 100 బంతుల్లో 9 ఫోర్లతో 86 పరుగులు చేయగా తిలక్ వర్మ 145 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 156 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 350 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన త్రిపుర, 42 ఓవర్లలో 236 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

బిక్రమ్‌కుమార్ దాస్ 65, మిలింద్ కుమార్ 67 పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ 8 ఓవర్లలలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. రవితేజ రెండు, భవనక సందీప్ రెండు వికెట్లు తీశారు.

మరో మ్యాచ్‌లో పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది తమిళనాడు. గురుకీరట్ సింగ్ అద్భుత సెంచరీ (121 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 139 నాటౌట్) కారణంగా పంజాబ్ 288 పరుగులు చేయగా తమిళనాడు 4 వికెట్లు కోల్పోయి చేధించింది. జగదీశన్ 101 పరుగులు చేసి అవుట్ కాగా ఆఖర్లో 36 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసిన షారుక్ ఖాన్, జట్టును గెలిపించాడు.