ధోని రిటైర్మెంట్... గతకొంత కాలంగా తీవ్ర చర్చకు కారణమవుతున్న అంశం. కేవలం అభిమానులే కాదు ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు, విశ్లేషకుల్లో కూడా దీనిపైన చర్చ. పలు సందర్భాల్లో సెలెక్టర్లు సైతం దీనిపై స్పందించారు. కానీ ధోని నుండి మాత్రం అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ తన రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటన వెలువడటం లేదు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ విషయంపై కాస్త ఘాటుగా స్పందించారు. 

''ధోని రిటైర్మెంట్ పై తేల్చుకోవాల్సిన సమయమిదే. ఎందుకంటే భవిష్యత్ లో జరగనున్న ఐసిసి టోర్నీల కోసం జట్టును ఇప్పటినుండే తీర్చిదిద్దాల్సి వుంటుంది. కాబట్టి ధోని తన రిటైర్మెంట్ పై ఎంత తొందరగా క్లారిటీ ఇస్తే అంత మంచిది. 

ఒకవేళ ధోని స్పందించని పక్షంలో సెలెక్షన్ కమిటీ కాస్త ధైర్యం చేయాల్సి వుంటుంది. అతడి నుండి ప్రకటన వెలవడే వరకు నిరీక్షిస్తామంటే ఎలా..? మాకు,  అభిమానులకు క్లారిటీ లేకున్నా పరవాలేదు మీకయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ అవసరం. అవసరమైతే అతడికి ఏం చేస్తే బావుంటుందో సూచించే అధికారాలు కూడా మీకున్నాయి. ఓ వ్యక్తి కంటే దేశం ముఖ్యమని సెలెక్టర్లు గుర్తిస్తే మంచిది.

రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత విషయమే. దాన్ని నేను కాదనను. కానీ ఏ ఒక్కరి కోసమే జట్టు ప్రయోజనాలు దెబ్బతినకూడదు. అలాంటి సమయాల్లో మేనేజ్‌మెంట్ ఓ అడుగు ముందుకేస్తే తప్పేమీ వుండదు. 

టీ20 ప్రపంచ గురించి చెప్పలేను కానీ 2023 లో జరిగే వన్డే ప్రపంచకప్ అయితే ధోని ఆడే అవకాశాలే లేవు. అప్పటివరకు కోహ్లీ కెప్టెన్ గా వుంటాడని కూడా ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి అప్పటివరకు జట్టును సంసిద్దం  చేయాలంటే ఇప్పటినుండే ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. ధోని, కోహ్లీలపై ఆదారపడకుండా వుండే జట్టును తయారుచేయాలి.'' అని గంభీర్ పేర్కొన్నాడు.