టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ మరోసారి విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి మాత్రం కోహ్లీపై విరుచుకుపడకుండా అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. ఇటీవల  ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును  ముందుడి నడిపించడంలో విఫలమైన కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే గంభీర్ ఓ వైపు కోహ్లీని సమర్థిస్తూనే మరో వైపు అతడి వైఫల్యాలను ఎత్తిచూపుతూ చురకలు అంటించాడు. 

విరాట్ కోహ్లీ కెప్టెన్సీని మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీలతో పోల్చిచూడటం తగదన్నారు. ఎవరి కెప్టెన్సీ స్టైల్ వారికుంటుందని... నిర్ణయాలు తీసుకోవడంలో, ఆటగాళ్లను ఉపయోగించడంలో ఒక్కో సారథి ఒక్కోలా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాబట్టి ఓసారి సక్సెస్ అయిన కెప్టెన్ తో విఫలమైన కెప్టెన్లను పోల్చడం తగదని గంభీర్ అభిప్రాయపడ్డారు. 

ఐపిఎల్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే రోహిత్  శర్మ అత్యుత్తమ కెప్టెన్ గా కనిపిస్తాడని గంభీర్ అన్నారు. ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగుసార్లు ట్రోఫీని అందించిన ఘనత అతడికే దక్కుతుందన్నాడు. అంతేకాకుండా ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించి విజయాన్ని అందుకున్నాడు. కాబట్టి కోహ్లీ  తర్వాత టీమిండియా కెప్టెన్ బాధ్యతలు చేపట్టడానికి రోహితే కరెక్టని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కంటే అతడి వారసుడు(రోహిత్) కెప్టెన్సీయే అద్భుతంగా వుటుందని గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.