వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా టీ20, వన్డే సీరిస్ లను క్లీన్ స్వీప్ చేసింది. ఇక మిగిలింది టెస్ట్ సీరిస్ మాత్రమే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న ఈ సీరిస్ ను ఎలాగైన గెలుచుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో వుంది. అయితే ఇప్పటికే ప్రారంభమైన మొదటి టెస్ట్ కోసం టీమిండియా సరైన వ్యూహాలతో బరిలోకి దిగలేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోపించాడు. అందువల్లే మిగతా రెండు సీరిసుల్లో చేతులెత్తేసిన వెస్టిండిస్ జట్టు ఈ టెస్టులో గెలుపుకోసం పోరాడుతోందని అన్నారు. 

ముఖ్యంగా మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం తుది జట్టు ఎంపిక సరిగ్గా లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్ ద్వారా మంచి ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మను ఈ మ్యాచ్ ఓపెనర్ గా బరిలోకి దించాల్సిందని అన్నాడు. సీనియర్ ఆటగాన్ని పక్కనబెట్టి మయాంక్ అగర్వాల్ ను ఆడించడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నట్లు గంగూలీ అభిప్రాయపడ్డాడు.  

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కూడా తుది జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యకరంగా వుందన్నాడు. విండీస్ లోని పిచ్ లు ఫేస్ కు సహకరిస్తాయని తెలుసు...అయినప్పటికి గతంలో ఆ పిచ్ లపై అశ్విన్ రాణించాడు. ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లను ఆడించాలన్ని నిర్ణయం సరైనదే కానీ మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ కు అవకాశమిస్తే మరింత బావుండేదని అన్నాడు. అశ్విన్, కుల్దీప్ యాదవ్  లలో ఎవరో ఒకరిని స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో అవకాశం కల్పించాల్సిందని  గంగూలీ అభిప్రాయపడ్డాడు. 

ఈ టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి ముందుకూడా గంగూలీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ టోర్నీలో అదరగొట్టిన రోహిత్ అదే ఫామ్ ను కొనసాగిస్తే టీమిండియా సునాయాసంగా విజయం సాధించవచ్చని తెలిపాడు. కాబట్టి రోహిత్ కు టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేసే అవకాశాన్ని కల్పించాలని గంగూలీ టీమిండియా మేనేజ్‌మెంట్ కు సూచించాడు.