అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేయర్ ఎవరు? ఈ ప్రశ్నే ఇపుడు క్రికెట్ సమాజంలో హాట్ టాపిక్. అయితే ఆ పోటీలో వున్నది మాత్రం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే. గతకొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న విరాట్ కోహ్లీ, యాషెస్ సీరిస్ లో అదరగొట్టిన స్టీవ్ స్మిత్ లలో ఎవరు అత్యుత్తమ ఆటగాడో అభిమానులు తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా ఈ ప్రశ్నపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెరైటీగా స్పందించారు. 

'' టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. చాలాకలంగా ఫామ్ ను  కొనసాగిస్తూ అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీయే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇది భారతీయులకు సంతోషాన్ని కలిగించే విషయం. 

కానీ ఏడాది నిషేదం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన స్మిత్ ఏమాత్రం తక్కువకాదు. అతడికి కూడా వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడికుండే అర్హతలన్నీ వున్నాయి. ముఖ్యంగా ఇటీవల యాషెస్ సీరిస్ లో అతడు సెంచరీలో పరుగులు సునామీ సృష్టించి ఆసిస్ గెలుపుకోసం ఒంటిపోరాటం చేశాడు. ఇలా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడగల సత్తా వున్నవాడే నెంబర్ వన్ ఆటగాడు.

ఇలా కోహ్లీ, స్మిత్ లు ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే. వారిద్దరిని అస్సలు పోల్చలేం. కాబట్టి నా దృష్టిలో ఇద్దరూ వరల్డ్ నెంబర్ వన్ ఆటగాళ్లే.'' అని  గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

యాషెస్ సీరిస్ హీరో స్టీవ్ స్మిత్ ఐసిసి టెస్ట్ ర్యాకింగ్స్ లో కోహ్లీని వెనక్కినెట్టి  అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు.  స్మిత్ 937 రేటింగ్ పాయింట్లతో టాప్ లో నిలవగా కోహ్లీ 903 రేటింగ్ పాయింట్లతో రెండో స్ధానంలో  నిలిచాడు. వీరిద్దరి మధ్య 34 పాయింట్లు తేడా వుంది. ఇలా టెస్ట్ ర్యాకింగ్ లో  కోహ్లీని స్మిత్ వెనక్కినెట్టినప్పటి నుండి వీరిద్దరిలోఎవరు గొప్ప ఆటగాడన్న ప్రశ్న మొదలయ్యింది. దీనిపై ఆస్ట్రేలియా, భారత  మాజీ క్రికెటర్లు కొందరు ఎవరో  ఒకరికి మద్దతివ్వగా గంగూలీ మాత్రం ఇద్దరికీ మద్దతుగా నిలిచాడు.