దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు కైల్ జాన్ అబ్బాట్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరై రెండేళ్లవుతున్నా అతడు కౌంటీ క్రికెట్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా కౌంటీ ఛాంపియన్‌షిప్ ద్వారా అబ్బాట్ తన బౌలింగ్ లో ఏమాత్రం పదును తగ్గలేదని నిరూపించాడు. ఒంటిచేత్తో హాంప్ షైర్ ను  గెలిపించి సత్తా చాటాడు. 

కౌంటీ ఛాంపియన్‌షిప్ లో భాగంగా హాంప్ షైర్, సోమర్ సెట్ జట్లు తలపడ్డాయి. ఇందులో హాంప్ షైర్ ఆటగాడు, సౌతాఫ్రికా మాజీ బౌలర్ అబ్బాట్ హవా కొనసాగింది. అతడు రెండు ఇన్నింగ్సుల్లో కలిపి  ఏకంగా  17 వికెట్లు పడగొట్టి సోమర్‌సెట్ బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు. ఇలా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ  గణాంకాలు నమోదు చేసుకున్న రెండో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

1956 లో ఇంగ్లాండ్ స్పిన్నర్  జిమ్ లేకర్ 19వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటికీ ఇవే అత్యత్తమ గణాంకాలు. తాజాగా 17 వికెట్లు సాధించిన అబ్బాట్ ఇతడి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అబ్బాట్ మొదటి  ఇన్నింగ్స్ లో 9, రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లతో విజృంభించడం ద్వారా ఈ రికార్డును సాధించాడు. అబ్బాట్ అదరగొట్టడంతో సోమర్ సెట్ పై హాంప్ షైర్ 136 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.