మహేంద్ర సింగ్ ధోని... ఇండియన్ క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుతమైన ప్రతిభతో భారత జట్టులో చోటు దక్కించుకున్న అతడు టీమిండియా పగ్గాలు చేపట్టాక అద్భుతమైన వ్యూహకర్తగా మారాడు. క్లిష్ట సమయాల్లో కూడా ఒత్తిడికి లోనవకుండా చివరి బంతి వరకు పోరాడేతత్వం కలిగిన అతడిని అభిమానులు మిస్టర్ కూల్ అని ముద్దుగా  పిలుచుకోవడం మనం వింటుంటాం. కానీ తాజాగా అతడి క్రేజ్ ఎంతలా పాకిపోయిందంటే సాధారణంగా పాక్ ఆటగాళ్లు మనల్ని శతృవుల్లా చూస్తుంటారు. అలాంటిది వారి నుండే ధోని ప్రశంసలు పొందుతున్నాడంటే అతడెంత గొప్ప ఆటగాడో మనం అర్థం చేసుకోవచ్చు. 

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ప్రపంచ కప్ టోర్నీ గురించి మాట్లాడుతూ ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు. టీమిండియా ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ధోని లాంటి ఆటగాడు లభించడని అన్నాడు. మొత్తంగా ధోని  ఒక ట్రంప్ కార్డ్ వంటివాడని అబ్బాస్ పేర్కొన్నాడు. 

''భారత జట్టులో జీనియస్ అనబడే  మహేంద్ర సింగ్ ధోని వున్నాడు. అతడు ఇండియన్ క్రికెట్ కు బ్రెయిన్ వంటివాడు. ఆటపై అతడికున్న అవగాహన, అనుభవంతో భారత్ కు రెండు ప్రపంచ కప్ లు సాధించిపెట్టాడు. అతడు కెప్టెన్ గానే కాకుండా  ఓ కోచ్ గా వ్యవహరిస్తాడు. అందువల్లే ట్రంప్ కార్డ్ గా మారాడు.

ధోని సారథ్యంలో మొదట 2007లో టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా  ఆ తర్వత 2011లో వన్డే వరల్డ్ కప్ అందుకుంది. అలాగే అతడి కెప్టెన్సీలోనే 2010,2016 సంవత్సరాల్లో ఆసియా కప్, 2013  లో చాంపియన్స్  ట్రోపి సాధించింది.'' అంటూ ధోనిపై  అబ్బాస్ ప్రశంసల జల్లు కురిపించాడు.