ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సీరిస్ లలో టీమిండియా బ్యాటింగ్ వైపల్యం బయటపడింది. బ్యాటింగే ప్రధానాస్త్రంగా వరల్డ్ కప్ లో బరిలోకి దిగాలనుకున్న భారత జట్టు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడిన వన్డే సీరిస్ లో మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమవడంతో టీమిండియా వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. అంతకుముందు జరిగిన రెండు వన్డేల్లో మిడిల్ ఆర్డర్ రాణించడంతో భారత జట్టు మంచి ఫలితాన్ని రాబట్టగలిగింది. 

ఇలా మిడిల్ ఆర్డర్ విఫలమవడం మరీ ముఖ్యంగా నాలుగో స్ధానంలో ఆటగాళ్లెవరు రాణించకపోవడం టీమిండియకు ఆందోళనను కలిగిస్తోంది. అయితే ప్రంపంచ కప్ కు ముందు జట్టును విజయావకాశాలను దెబ్బతీస్తున్న ఈ నాలుగో స్ధానం సమస్యకు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి పరిష్కారం కనుగొన్నాడు.

తాను చెప్పే పరిష్కారం నమ్మేలా  లేకున్నా  అదే నిజమని గంగూలి అన్నారు. భారత జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి రాణించగల సత్తా ఒక్క చతేశ్వర్ పుజారాకు మాత్రమే వుందన్నారు. అతడు గొప్పగా ఆడకపోవచ్చు...టెస్ట్ జట్టుకే సరిపోయేలా ఆడొచ్చు... కానీ వన్డేల్లో మాత్రం భారత మిడిల్ ఆర్డర్ సమస్యను అతడు తీర్చగలడని గంగూలీ పేర్కొన్నాడు. 

ఇప్పటికే టీమిండియా నాలుగో స్థానంలో పలువురు యువ బ్యాట్ మెన్స్ ని ప్రయోగించి విఫలమైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తూ చటేశ్వర్ పుజారాకు మాత్రమే ఆ స్ధానంలో రాణించే సత్తా వుందని బావిస్తున్నానన్నారు. అంతకంటే మెరుగైన చాయిస్ టీమిండియా మేనేజ్ మెంట్ వద్ద లేదు కాబట్టి ప్రపంచ కప్ లో పుజారాకు ఆ అవకాశమివ్వాలని గంగూలీ సూచించారు.