ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ 2019 కోసం బిసిసిఐ ప్రకటించిన భారత జట్టు అద్భుతంగా వుందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. గత ప్రపంచ కప్ జట్ల కంటే ఇప్పుడు బలమైన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారన్నారు. అయితే జట్టు కూర్పులో మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తోందని అన్నారు. ఇంకో పేసర్ జట్టులో వుంటే బౌలింగ్ విభాగం మరింత బలంగా కనిపించేదని గంభీర్ అభిప్రాయపడ్డారు.

ఇంగ్లాండ్ పిచ్ లపై విజయాలు సాధించాలంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగం పటిష్టంగా  వుండాలన్నారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన జట్టులో బ్యాటింగ్ విభాగం బాగానే వున్న బౌలింగే కాస్త వీక్ గా కనిపిస్తోంది. మరో పేసర్ ని సెలెక్టర్లు ఎంపిక చేసివుంటే బావుండేదని అన్నారు. ముగ్గురుు పేసర్లు,  ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఆలౌ రౌండర్లకు తోడుగా మరో పేసర్ వుంటే బౌలింగ్ విభబాగం మరింత పటిష్టంగా వుండేదన్నారు. అందుకోసమే స్పెషలిస్టు పేసర్లు జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీలతో పాటు నవదీప్‌సైనీని ప్రపంచ కప్ ఆడిస్తే టీమిండియా మరింత లాభపడేదని గంభీర్ అన్నారు. 

ఈ ఒక్క లోటును మినహాయిస్తే మిగతా విషయాల్లో జట్టు బలంగా వుందన్నారు. గత 2011, 2015లోని ప్రపంచకప్‌ జట్ల కన్నా ఈ జట్టు బలంగా కనిపిస్తోందన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విబాగాల్లో సమతూకంతో వున్న ఈ జట్టుకు ప్రపంచ కప్ ట్రోపీ గెలిచే అన్ని అర్హతలు వున్నాయని గంభీర్ కితాబిచ్చాడు. 

ఇటీవలే ప్రపంచ కప్ జట్టులో ఆటగాళ్ళ ఎంపికపై గంభీర్ ఈ విధంగా స్పందించారు. '' ప్రపంచకప్‌ ఆడే భారత జట్టులో పంత్‌ లేకపోవడంపై నాకు బాధేమీ లేదు. కానీ అంబటి రాయుడు లేకపోవడం చెప్పలేనంత బాధగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. తెలుపు బంతి క్రికెట్‌లో 47 సగటు నమోదు చేసిన 33 ఏళ్ల ఆటగాడి (రాయుడు)ని పక్కన బెట్టడం ఘోరం. సెలక్షన్‌ కమిటీ చేసిన మొత్తం ఎంపిక ప్రక్రియలో ఈ అంశమే నన్ను తీవ్రంగా కలచివేస్తుంది. ’’అని గంభీర్ పేర్కొన్నారు.