ఆండ్రీ రస్సెల్... కలకత్తా జట్టుకు దొరికిన మిస్సైల్. ఐపిఎల్ లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఒంటిచేత్తో విజయాలను  అందించి  సత్తా  చాటుతున్నాడు. బౌలింగ్ లో పరవాలేదనిపిస్తున్నాడు కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సునామీ సృష్టిస్తున్నాడు. పూనకం వచ్చినట్లు భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విలువైన పరుగులు అందిస్తూ విజయతీరాలకు చేరుస్తున్నాడు. ఇలా ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిలా మారిన రస్సెల్స్ గతంలో  కేకేఆర్ యాజమాన్యం తనను ఏడిపించిదంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 

అయితే అలా తానే ఏడవడానికి కారణం తనపై వారు చూపించిన ప్రేమేనని తెలిపాడు. తాను అంతర్జాతీయ జట్టు నుండి నిషేధం ఎదుర్కొని కష్టాల్లోకి నెట్టబడిని సమయంలో కేకేఆర్ యాజమాన్యం అండగా నిలిచిందన్నాడు. ఇలా అతి ప్రేమతో వారు  తనను ఏడిపించారని గుర్తుచేసుకుంటూ రస్సెల్స్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. 

డోపింగ్ నిబంధనలను ఉళ్ళంఘించని రస్సెల్స్ 2017లో అంతర్జాతీయ క్రికెట్ నుండి నిషేధానికి గురయ్యాడు. దీంతో అతడు ఆ సంవత్సరం జరిగిన ఐపిఎల్ కు కూడా దూరమయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో తనకు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ నుండి ఫోన్ వచ్చిందని...జట్టు మొత్తం నీకు మద్దతుగా వుంటామంటూ ఆయన ధైర్యానిచ్చారని రస్సెల్స్ వెల్లడించాడు. ఆయన ఆ మాటలను విన్న వెంటనే తనకు ఏడుపు ఆగలేదని...చిన్నపిల్లాడిలా గుక్కపట్టి  మరీ ఏడ్చానని స్వయంగా రస్సెల్స్ బయటపెట్టాడు.

ఆయన చెప్పినట్లు నిషేధం తర్వాత ఈ ఐపిఎల్ సీజన్ 12 లో మళ్లీ తనకు కేకేఆర్ తరపున బరిలోకి దిగే అవకాశాన్ని కల్పించారన్నాడు. వెంకి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వుండాలనే తాను కసితో  ఆడుతున్నట్లు తెలిపాడు. ఈ సీజన్లో తానే ఈ స్థాయిలో రెచ్చి పోయి సక్సెస్ ఫుల్ ఆటగాడిగా రాణించడానికి కేకేఆర్ సీఈవోనే కారణమని...ఆయనకు తాను రుణపడి వున్నానని రస్సెల్స్ ఉద్వేగభరితంగా మాట్లాడాడు.  

ప్రస్తుతం ఐపిఎల్ లో ఇప్పటివరకు కేకేఆర్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో రస్సెల్ 74 సగటుతో 377 పరుగులు చేశాడు. ఈ పరుగులను సాధించడానికి అతడు 220 పైగా స్ట్రైక్ రేట్ 220 తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇలా కేకేఆర్ జట్టు ఈ సీజన్లో సాధించిన ప్రతి విజయంలో రస్సెల్ పాత్ర వుంది.