వరుణ్ చక్రవర్తి... అందరూ భారత జట్టులో చోటు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూ, ‘ఒక్క ఛాన్స్’ రాకపోతుందా? అని ఎదురుచూస్తుంటే, ఇతను మాత్రం వచ్చిన అవకాశాలను చెడగొట్టుకుంటున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికయ్యాడు.

కానీ సీజన్ ప్రారంభానికి ముందే గాయం కారణంగా తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎంపికైన నటరాజన్, ఆసీస్ టూర్‌లో ఆకట్టకున్నాడు. గాయంతో ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లకపోయినా ఆ టైమ్‌ని కరెక్టుగా వాడుకున్న వరుణ్ చక్రవర్తి, పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కి కూడా వరుణ్ చక్రవర్తికి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే బీసీసీఐ నిర్వహించిన 2 కి.మీ. ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయ్యాడట. కొత్త రూల్ ప్రకారం ఈ ఫిట్‌నెస్ పాస్ అయిన వారికే జట్టులో చోటు దక్కుతుంది. దీంతో ఈసారి కూడా వరుణ్ చక్రవర్తి, భారత జట్టుకి దూరమైనట్టే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.