మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ పై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. అతడు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు విదర్భ కు చెందిన  క్రికెట్ హిత్ రక్షక్ సంస్థ   చీఫ్ దేవేంద్ర సుర్తి ఆరోపిస్తున్నారు. మునాఫ్ నుండి తనను కాపాడాలంటూ ఆయన నవాపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో  పోలీసులు మునాఫ్ పై కేసు నమోదు చేశారు. 

మునాఫ్ ప్రస్తుతం బరోడా క్రికెట్ జట్టు  మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే  కొద్దిరోజుల క్రితమే బరోడా జట్టులో ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని ఆరోపణలు వచ్చాయి. అసోసియేషన్  అధికారులతో కలిసి  మునాఫ్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు దేవేంద్ర స్పుర్తి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ  పోరాటాన్ని ఆపాలన్న ప్రయత్నంలో  భాగంగానే మునాఫ్ తనహత్యకు కుట్ర పన్నినట్లు సుర్తి ఆరోపిస్తున్నారు. 

అయితే సుర్తి ఆరోపణలను మునాఫ్ ఖండించారు. సుర్తి తన పేరును అనవసరంగా వివాదంలోకి లాగుతున్నాడని  ఆరోపించాడు.కేవలం తాను బరోడా టీం మెంటార్ ని మాత్రమేనని అతడు గుర్తుంచుకుని మాట్లాడాలన్నాడు. క్రికెట్ వ్యవహారాలు తెలిసిన  వ్యక్తే ఇలా మెంటార్  కు ఆటగాళ్ల ఎంపికకు సంబంధమున్నట్లు పేర్కొనడం  విడ్డూరంగా వుందని మునాఫ్ అన్నాడు.

ఇక తాను చంపడానికి కుట్రలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేయడం మరీ దారుణమన్నాడు.  తనకు కేవలం క్రికెట్ ఆడటం మాత్రమే తెలుసు. ఇలా మొదటిసారిగా తన పేరును వివాదాల్లోకి లాగుతున్నారన్నాడు. ఇకనైనా తన పని తాను చేసుకోనివ్వాలని మునాఫ్ కోరాడు.