Pakistan vs Australia: నిర్ణయాత్మక మూడో టెస్టును  ఆస్ట్రేలియా నెమ్మదిగా ప్రారంభించింది. తొలి రోజు తన సహజశైలికి భిన్నంగా ఆడింది.  తొలి రెండు టెస్టులలో ఫలితం  తేలకపోగా ఈ టెస్టు ఇరు జట్లకు కీలకమైంది. 

పాకిస్థాన్-ఆస్ట్రేలియా ల మధ్య లాహోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు తన సహజశైలికి విరుద్ధంగా నిదానంగా ఆడింది. సాధారణంగా టెస్టులలో బ్యాటింగ్ కు వస్తే ఓవర్ కు కనీసం 4 పరుగుల సగటుతో 300 కు పైగా పరుగులు చేయగల సత్తా ఉన్న ఆ జట్టు.. పాకిస్థాన్ తో మూడో టెస్టులో మాత్రం నత్తకు నడక నేర్పిందా..? అనిపించింది. 88 ఓవర్లు ఆడిన కంగారూలు.. కనీసం 250 పరుగులు కూడా చేయలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఖవాజా, స్మిత్ లు అర్థ సెంచరీలతో ఆదుకున్నారు. 

లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 2009 తర్వాత ఈ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే ప్రథమం. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ కు ఆదిలోనే షాకిచ్చింది పాకిస్థాన్..

Scroll to load tweet…

ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (13 బంతుల్లో 7) ను ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే షాహీన్ అఫ్రిది వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వార్నర్ ను ఎల్బీగా వెనక్కి పంపిన అఫ్రిది.. అదే ఓవర్లో ఆఖరు బంతికి టెస్టులలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న మార్నస్ లబూషేన్ (0) ను కూడా డకౌట్ చేశాడు. 

ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్ తో కలిసి ఖవాజా ఆస్ట్రేలియా బ్యాటింగ్ బాధ్యతలను మోశాడు. 219 బంతులాడిన ఖవాజా.. 91 పరుగులు చేసి సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఇక స్టీవ్ స్మిత్ కూడా 169 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఖవాజాను సాజిద్ ఖాన్ ఔట్ చేయగా.. స్మిత్ ను నజీమ్ షా ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 138 పరుగులు జోడించారు. వీరిద్దరూ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ (48 బంతుల్లో 20) కూడా క్రీజులో నిలవలేదు. 

Scroll to load tweet…

అయితే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (15 బంతుల్లో 8 నాటౌట్) తో కలిసి ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (48 బంతుల్లో 20 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. తొలి రోజు ఆట ముగిసి సమయానికి ఆసీస్.. 88 ఓవర్లలో 232 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో అఫ్రిదికి 2 వికెట్లు దక్కగా.. నజీమ్ షా కూడా 2 వికెట్లు పడగొట్టాడు. సాజిద్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది.