India vs Australia 4th Test: 50 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... సిరీస్‌లో మూడో హాఫ్ సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా...
అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, మొదటి రెండు సెషన్లలో మంచి ఆధిక్యాన్ని కనబర్చింది. తొలి రోజు మొదటి 6 ఓవర్లలో వచ్చిన అవకాశాలను అందుకోవడంలో విఫలమైన టీమిండియా... ఆస్ట్రేలియాకి కోలుకునేందుకు మళ్లీ మళ్లీ ఛాన్సులు ఇచ్చింది...
ట్రావిస్ హెడ్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ జారవిడిచాడు. 10 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజాని రనౌట్ చేసే అవకాశాన్ని వదిలేశాడు శుబ్‌మన్ గిల్. ఈ రెండూ ఆసీస్‌కి చక్కగా కలిసి వచ్చాయి...
తొలి వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. 44 బంతుల్లో 7 ఫోర్లతో 32 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 20 బంతుల్లో 3 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ కలిసి ఆస్ట్రేలియాని ఆదుకున్నారు. తొలి రోజు మొదటి సెషన్ ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, రెండో సెషన్‌లో భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యింది..
ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ... ఇలా బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా టీమిండియాకి ఫలితం దక్కలేదు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఫోర్ బాది, 146 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఉస్మాన్ ఖవాజా.. అతనికి ఇది టెస్టుల్లో 22వ హాఫ్ సెంచరీ కాగా ఈ సిరీస్‌లో మూడోది...
50 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చసింది ఆస్ట్రేలియా. ఉస్మాన్ ఖవాజా 153 బంతుల్లో 9 ఫోర్లతో 56 పరుగులు చేయగా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ 85 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరూ 168 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
మూడో టెస్టులో విశ్రాంతి తీసుకున్న మహ్మద్ షమీతో ఓపెనింగ్ ఓవర్ వేయించాడు రోహిత్ శర్మ. అయితే 10 రోజుల గ్యాప్ తర్వాత బంతి అందుకున్న మహ్మద్ షమీ, రిథమ్ అందుకోవడానికి టైం తీసుకున్నాడు... మొదటి బంతికే భారీ వైడ్ వేసిన మహ్మద్ షమీ, మొదటి ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చేశాడు.
తన మొదటి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేసిన అశ్విన్, డీఆర్‌ఎస్ తీసుకోలేదు. టీవీ రిప్లైలో అది వికెట్లను మిస్ అవుతున్నట్టు తేలింది. ఆ తర్వాత ఓవర్‌లో రనౌట్ ఛాన్స్ మిస్ చేశాడు శుబ్‌మన్ గిల్...
అశ్విన్ బౌలింగ్‌లో ఖవాజా ఆడిన షాట్‌ని అడ్డుకున్న శుబ్‌మన్ గిల్, మెరుపు వేగంతో వికెట్ల వైపు విసిరినా గురి తప్పింది. వికెట్లకు తగిలి ఉంటే ఉస్మాన్ ఖవాజా 10 పరుగుల వద్ద అవుటై ఉండేవాడు..
