Asianet News TeluguAsianet News Telugu

అమెరికా మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా శివనారాయణ్ చందర్‌పాల్..

Shivnarine Chanderpaul: వెస్టిండీస్ మాజీ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్ చందర్‌పాల్ కు అరుదైన గౌరవం దక్కింది. అతడు అగ్రరాజ్యం అమెరికా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. 

USA Cricket Appointed Shivnarine Chanderpaul as Head Coach For Women Teams
Author
India, First Published Jul 4, 2022, 1:32 PM IST

గత తరం ఆటగాళ్లలో తప్పక వినిపించే పేరు శివనారాయణ్ చందర్‌పాల్. భారత సంతతికి చెందిన ఈ విండీస్ మాజీ దిగ్గజం ఇరవై ఏండ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్రవేశాడు. ఇప్పుడు అతడికి అగ్రరాజ్యం అమెరికా కీలక బాధ్యతలు అప్పజెప్పింది. యూఎస్ఎ  మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా అతడు నియమితుడయ్యాడు. మహిళల సీనియర్ జట్టుతో పాటు అండర్-19 టీమ్ కు కూడా అతడే హెడ్ కోచ్ గా వ్యవహరిస్తాడు. ఈ మేరకు యూఎస్ఎ  క్రికెట్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

రిటైర్మెంట్ తర్వాత అమెరికాలోనే ఉంటున్న ఈ  47 ఏండ్ల విండీస్ దిగ్గజ ఆటగాడు.. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) లో Jamaica Tallawahs కు హెడ్ కోచ్ గా ఉన్నాడు. అంతేగాక  ఇటీవలే ముగిసిన అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ లో వెస్టిండీస్ అండర్-19 జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పనిచేశాడు. 

కాగా అమెరికా  మహిళల జట్లకు హెడ్ కోచ్ గా నియమితుడైన చందర్‌పాల్.. తక్షణమే ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. జులై 3 నుంచి వెస్టిండీస్ లో  ప్రారంభమైన అండర్-19 రైజింగ్ స్టార్స్ టీ20 ఛాంపియన్షిప్ లో అమెరికా అండర్-19 జట్టు కూడా పాల్గొంటున్నది. ట్రినిడాడ్ అండ్ ట్రిన్బాగో లో జరుగుతున్న ఈ టోర్నీకి చందర్‌పాల్ యూఎస్ఎ జట్లకు  కోచ్ గా పనిచేయనున్నాడు. 

చందర్‌పాల్  ను నియమించుకోవడంపై యూఎస్ఎ క్రికెట్ స్పందిస్తూ.. ‘చందర్‌పాల్ ను యూఎస్ఎ అండర్-19 మహిళల జట్లకు హెడ్ కోచ్ గా నియమించినందుకు మేం సంతోషిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తైంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. 

 

ఇక తన నియామకంపై చందర్‌పాల్ మాట్లాడుతూ.. ‘యూఎస్ఎ జాతీయ మహిళా క్రికెట్ జట్లకు నేను హెడ్ కోచ్ గా అయినందుకు గర్వంగా ఉంది. అమెరికా మహిళల క్రికెట్ జట్టు ఉన్నతిని నేను చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. గత కొన్నాళ్లుగా నేను ఇక్కడే (ఫ్లోరిడా) లో ఉంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు యూఎస్ఎ క్రికెట్ కు కృతజ్ఞతలు..’ అని హర్షం వ్యక్తం చేశాడు. 

చందర్‌పాల్  క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. 1994 నుంచి 2015 వరకు అతడు విండీస్ క్రికెట్ కు సేవలందించాడు. 164 టెస్టులలో 11,867 పరుగులు.. 268 వన్డేలలో 8,778 పరుగులు చేశాడు. టెస్టులలో 30, వన్డేలలో 11 సెంచరీలు చేసిన ఈ దిగ్గజ ఆటగాడు.. తాను ఆడే సమయంలో కొరకరాని కొయ్య అని బౌలర్లు భావించేవారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios