వీరేంద్ర సెహ్వాగ్... క్రికెటర్ గా మైదానంలోనే ఎంత వైలెంటో బయట అంత సైలెంట్ గా వుండేవాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత అతడిలోని మరో వ్యక్తి బయటకు వచ్చాడు. విషయమేదైనా వుండని తనదైన టైమింగ్ పంచులతో అభిమానులను, నెటిజన్లు ఆకట్టుకుంటూ సీరియస్ సెహ్వాగ్ కాస్తా సోషల్ మీడియా సెహ్వాగ్ గా మారిపోయాడు. క్రికెటర్ గా అతడికి ఎంతయితే ఫ్యాన్ పాలోయింగ్ వుండేదో అదేస్థాయిలో ఇప్పుడు అతడి టైమింగ్ పంచులకు, సెటైర్లకు ఫాలోవర్స్ వున్నారు. దీంతో సెహ్వాగ్ కూడా సమయం, సందర్భాన్ని బట్టి స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయాడు. 

తాజాగా సెహ్వాగ్ తనపై తానే సెటైర్లు వేసుకుంటూ అభిమానులకు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. '' ఎనిమిదేళ్ల క్రితం  సరిగ్గా ఇదే రోజున(ఆగస్ట్ 12వ తేదీ) అంతర్జాతీయ క్రికెట్ లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండు రోజుల పాటు ప్రయాణించి మరీీ ఇంగ్లాండ్ కు చేరుకున్నాను. ఆతిథ్య జట్టుతో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ లో 188 ఓవర్లపాటు ఫీల్డింగ్ చేశా. అయితే ఆ  మ్యాచ్ ద్వారా అనుకోకుండానే ప్రముఖ భారత శాస్త్రవేత్త ఆర్యభట్టకు నివాళులు అర్పించాను. ఫెయిల్యూర్ ని సున్నా శాతానికి తగ్గించాలంటే మీరు(అభిమానుల) ఏం చేస్తారు..? దీనికి జవాబు మీ దగ్గర వుంటే దాన్నే ఫాలో కండి.'' అంటూ సెహ్వాగ్ తన ఘోర వైఫల్యాన్ని కూడా తేదీతో సహా గుర్తుచేశాడు. 

2011 లో టీమిండియా నాలుగు టెస్టుల సీరిస్ కోసం ఇంగ్లాండ్  లో పర్యటించింది. ఈ పర్యటన కోసం భారత జట్టులో సెహ్వాగ్ కు కూడా చోటుదక్కింది. అయితే ఈ సీరిస్ లో టీమిండియా ఆటగాళ్లందరూ ఘోరంగా విఫలమవడంతో ఇంగ్లీష్ జట్టు నాలుగు టెస్టుల్లోనూ విజయాన్ని అందుకుంది. అయితే బర్మింగ్ హామ్ వేదికన జరిగిన మూడో టెస్ట్ లో  సెహ్వాగ్ రెండు ఇన్నింగ్సుల్లోనే సున్నా పరుగులకే ఔటయ్యాడు. అది సరిగ్గా ఆగస్ట్ 12 రోజునే. దీంతో  తాజాగా ఆ రోజును ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ సున్నాను కనుగొన్న ఆర్యభట్టకు ఇంతకంటే గౌరవంగా ఎవరు నివాళులు అర్పిస్తారంటూ సెహ్వాగ్ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు.