ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం కన్నుమూయడంతో హిందీ చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం నుంచి కోలుకోకముందే మరో దిగ్గజ నటుడిని కోల్పోవడంతో బాలీవుడ్‌‌కు షాక్ తగిలింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషి కపూర్‌కు పలువురు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రిషి కపూర్ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ ఇది నమ్మశక్యం కానీ నిజం... నిన్న ఇర్ఫాన్ ఖాన్, ఈరోజు రిషీకపూర్. ఇవాళ ఒక దిగ్గజం కన్నుమూయడం జీర్ణించుకోలేని విషయం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మ శాంతించాలని కోహ్లీ ట్వీట్ చేశాడు.

ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా రిషీ కపూర్‌‌ కుటుంబానికి సంతాపం తెలిపారు. ‘‘ ఈ సమయంలో ఏం మాట్లాడో తెలియడం లేదు, పదాలను కూడా మరిచిపోయా, ఫోన్‌ను కూడా పట్టుకోలేకపోతున్నా. నిన్న ఇర్ఫాన్, ఇవాళ.... విచారంగా ఉందంటూ అనుష్క ట్వీట్ చేశారు.

రిషి కపూర్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన మరణవార్త చాలా బాధ కలిగించిందని సచిన్ అన్నారు. ఇన్నేళ్లుగా ఆయనను ఎప్పుడు కలిసినా.. ప్రేమతో మాట్లాడేవారు, ఆయన ఆత్మకి శాంతి కలగాలి. నీతూ గారికి, రణ్‌బీర్, రిషి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అంటూ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

రిషీకపూర్ మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ శిఖర్ ధావన్ ట్వీట్ చేశాడు. వీరితో పాటు వీరేంద్ర సెహ్వాగ్ , అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిశాస్త్రి, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు రిషీ కపూర్‌కు సంతాపం తెలిపారు.