Asianet News TeluguAsianet News Telugu

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌: ఐపీఎల్‌లో గేల్ గ్రాండ్‌ ఎంట్రీ

2011లో తాను సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ (2018 వేలంలో గేల్‌ను తీసుకోలేదు)పై గేల్‌ బయో బబుల్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్లో గేల్‌ గ్రాండ్‌ ఎంట్రీ ముందుగా అంచనాలు వేసినదే. బాస్‌  ఈజ్‌ బ్యాక్‌ స్టయిల్‌లో గేల్‌ ఎంట్రీ ఇచ్చాడు.
 

Universe Boss Chris Gayle IS Back With A Bang SRH
Author
Hyderabad, First Published Oct 16, 2020, 1:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఎలా అడుగు పెట్టాలనే విషయం విండీస్‌ వీరుడు, యూనివర్స్ బాస్‌ క్రిస్‌ గేల్‌కు బాగా తెలుసు. 2011 ఐపీఎల్. ఆటగాళ్ల వేలంలో విండీస్‌ స్టార్‌ను ఎవరూ తీసుకోలేదు.  

గాయపడిన డిర్క్‌ నానెన్స్‌ స్థానంలో క్రిస్‌ గేల్‌ లీగ్‌లోకి వచ్చాడు. వచ్చీ రాగానే పాత జట్టు కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 55 బంతుల్లో 102 పరుగుల సుడిగేల్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.

2018 ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలోనూ దాదాపు గేల్‌ మళ్లీ అమ్ముడుపోని పరిస్థితి. ఆఖరి రౌండ్‌లో పంజాబ్‌ అతడిని ఎంచుకుంది.  ఇక ఆ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 33 బంతుల్లో 63 పరుగుల ఇన్నింగ్స్‌తో గేల్‌ విరుచుకుపడ్డాడు.

2020 ఐపీఎల్‌. సీజన్‌ ప్రథమార్థం మ్యాచులు ముగిసిపోయాయి. ద్వితీయార్థం మ్యాచులు మొదలయ్యాయి. బెంచ్‌కు పరిమితం అయ్యాడో, అనారోగ్యంతో తుది జట్టుకు దూరంగా ఉన్నాడో తెలియదు.  

ఫిట్‌నెస్‌ సాధించాక తొలి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. 2011లో తాను సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ (2018 వేలంలో గేల్‌ను తీసుకోలేదు)పై గేల్‌ బయో బబుల్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్లో గేల్‌ గ్రాండ్‌ ఎంట్రీ ముందుగా అంచనాలు వేసినదే. బాస్‌  ఈజ్‌ బ్యాక్‌ స్టయిల్‌లో గేల్‌ ఎంట్రీ ఇచ్చాడు.

 పాత మిత్రుడు క్రిస్‌ గేల్‌ కోసం విరాట్‌ కోహ్లి ముందుగానే పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఐపీఎల్‌లో 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌ కలిగిన గేల్‌.. ఆఫ్‌ స్పిన్‌పై మాత్రం 111.78 స్ట్రయిక్ రేట్ కలిగి ఉన్నాడు.

ఇక ఐపీఎల్‌ 2020లోనే అత్యంత మెరుగైన ఎకానమీతో రాణిస్తున్న వాషింగ్టన్‌ సుందర్‌ను గేల్‌ కోసమే అట్టిపెట్టుకున్నాడు. సహజంగా పవర్‌ ప్లేలోనే రెండు ఓవర్ల కోటా పూర్తి చేసే వాషింగ్టన్‌ సుందర్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో పవర్‌ ప్లేలో రాలేదు. క్రిస్‌ గేల్‌ మూడో స్థానంలో రావటంతో, అతడిని మిడిల్ ఓవర్లకు దాటిపెట్టాడు కోహ్లి.

ఎనిమిదో ఓవర్‌ ఆఖరు బంతి తర్వాత క్రిస్‌ గేల్‌ క్రీజులోకి వచ్చాడు. తొమ్మిదో ఓవర్లో వాషింగ్టన్‌ సుందర్‌ చేతికి బంతిని ఇచ్చాడు కోహ్లి. ఆరంభంలో విరాట్‌ ప్లాన్‌ సవ్యంగా సాగుతున్నట్టే అనిపించింది.

వాషింగ్టన్‌ సుందర్‌ తొలి రెండు ఓవర్లలో 7 బంతులు ఎదుర్కొన్న గేల్‌.. నాలుగు సింగిల్స్‌ తీసుకున్నాడు.  ఇక ఆ తర్వాత, టీ20 ఫార్మాట్‌లో తాను ఎన్నో సార్లు చేసిన విధ్వంసమే పునరావృతం చేశాడు గేల్‌.

వాషింగ్టన్‌ సుందర్‌ గత మ్యాచుల తరహాలోనే గొప్పగా బంతులేశాడు. లెంగ్త్‌ విషయంలో వాషింగ్టన్‌ టోర్నీలో నూతన ప్రమాణాలు నెలకొల్పాడు. కానీ వాటిని క్రిస్‌ గేల్‌ రెండు ఓవర్లలో ధ్వంసం చేశాడు.

తర్వాతి ఓవర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ నుంచి 9 బంతులను ఎదుర్కొన్న క్రిస్‌ గేల్‌ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అందులో, గేల్‌ తనదైన శైలిలో కొట్టిన సిక్సర్లే ఉన్నాయి.

క్రిస్‌ గేల్‌ 45 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఆరంభంలో స్ర్టయిక్‌రేట్‌ గురించి పట్టించుకోని గేల్‌.. అనంతరం సిక్సర్ల వర్షం కురిపించాడు. క్రీజులోకి రాగానే పిచ్‌ను, బౌలర్లను బలాలను అంచనా వేసేందుకు గేల్ కొంత సమయం తీసుకున్నాడు.  

తొలి 15 బంతుల్లో 7 పరుగులే చేసిన గేల్‌.. తర్వాతి 30 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అలవోకగా సిక్సర్లు బాదే గేల్‌కు స్ట్రయిక్‌రేట్‌ ఎన్నడూ సమస్య కాలేదు.  పిచ్‌, బౌలింగ్‌ను అంచనా వేసి సిక్సర్‌గా మలచగలిగే ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి పంపించేందుకు గేల్ సిద్దమవుతాడు.  

టీ20ల్లో గేల్‌ ఇప్పటికే 983 సిక్సర్లు కొట్టాడు. కీరన్‌ పొలార్డ్‌ 685 సిక్సర్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో గేల్‌ విధ్వంసం ఇలాగే కొనసాగితే యుఏఈలోనే గేల్‌ పొట్టి ఫార్మాట్‌లో 1000 సిక్సర్ల రికార్డు సాధించే అవకాశం లేకపోలేదు.

ఐపీఎల్‌ 2020లో పంజాబ్‌ ఏడు మ్యాచులు ఆడినా క్రిస్‌ గేల్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక బెంగళూర్‌పై రానే వచ్చిన క్రిస్‌ గేల్‌ అభిమానుల అంచనాలను అందుకోని పాత జట్టుకు సింహస్వప్నం అయ్యాడు. గేల్‌ రాకతో అభిమానులే కాదు ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్టు సైతం బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ప్రణాళికలకు పట్టాలిక మరింత పదును అంటున్నాయి!.
 

Follow Us:
Download App:
  • android
  • ios