U19 World cup: సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయం సాధించిన అండర్-19 భారత జట్టు...
అండర్-19 ఆసియా కప్ గెలిచి, ఆ విజయోత్సహంతో అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీని ఆరంభించింది యువ భారత జట్టు. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 45 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అండర్-19 భారత జట్టు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 46.5 ఓవర్లలో 232 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీ 5, హర్నూర్ సింగ్ 1 పరుగుకే అవుట్ కావడంతో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత్. షేక్ రషీద్, కెప్టెన్ యష్ ధుల్ కలిసి మూడో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు...
54 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన షేక్ రషీద్ అవుటైన తర్వాత నిశాంత్ సింధు 25 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు, రాజ్ భవ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేశాడు. కుశాల్ తంబే 44 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేయగా వికెట్ కీపర్ దినేశ్ బన 7, విక్కీ వత్సల్ 9 పరుగులు చేశారు...
ఓ వైపు వికెట్లు పడుతున్నా 100 బంతుల్లో 11 ఫోర్లతో 82 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న యశ్ ధుల్, రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. రాజవర్థన్ హంగర్కేర్ డకౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది...
లక్ష్యఛేదనలో ఎథన్ జాన్ డకౌట్ కావడంతో సున్నా వద్దే తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత వాలెంటైన్ కిటిమె 25, డెవాల్డ్ బ్రేవిస్ 65 పరుగులు, కెప్టెన్ జార్జ్ వాన్ హీడెన్ 36 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా అండర్-19 టీమ్ 45.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లలో 28 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన విక్కీ వత్సల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. రాజ్ భవ 47 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, రాజ్‌వర్థన్‌కి ఓ వికెట్ దక్కింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ టోర్నీకి కూడా వర్షం అడ్డంకిగా మారింది.. అండర్-19 భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.
భారత జట్టు తన తర్వాతి మ్యాచ్ జూన్ 19న ఐర్లాండ్‌తో ఆడనుంది. జూన్ 22న ఉగాండాతో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. నాలుగు సార్లు అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టు, ఈసారి కూడా టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. గత అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలోనూ ఫైనల్ చేరిన భారత యువ జట్టు, తుది పోరుతో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడింది...
అండర్-19 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడుతున్న భారత యువ జట్టుకి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌తో పాటు ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
