IND U19 vs SL U19: వర్షం కారణంగా 38 ఓవర్లకు కుదించిన ఫైనల్... 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసిన శ్రీలంక...టీమిండియా ముందు 102 పరుగుల టార్గెట్...
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు, భారత జట్టు ముందు 102 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు,38 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేయగలిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలగడంతో టీమిండియా టార్గెట్‌ను 102గా నిర్ణయించారు.
వర్షం కారణంగా దాదాపు గంటసేపు మ్యాచ్ నిలిచే సమయానికి 33 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది... ఆ తర్వాత దూకుడుగా ఆడిన లంక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జట్టుకి మంచి స్కోరు అందించారు. మొదటి 33 ఓవర్లలో 74 పరుగులే చేసిన లంక, చివరి 5 ఓవర్లలో 32 పరుగులు చేయడం విశేషం.
మొదటి ఓవర్ నుంచి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది శ్రీలంక. నాలుగో ఓవర్‌లో చమీందు విక్రమసింగే 2 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 15 పరుగులు మాత్రమే చేయగలిగింది లంక జట్టు...
28 బంతుల్లో 6 పరుగులు చేసిన శివాన్ డానియల్‌ను రాజ్ భవ అవుట్ చేయగా, 33 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన అంజల బండారాని కుశాల్ తంబే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు...
17 బంతుల్లో 4 పరుగులు చేసిన పవన్ పతిరాజాను కుశాల్ తంబే క్లీన్ బౌల్డ్ చేయగా, 36 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన సదీశ రాజపక్ష, విక్కీ వత్సల్ బౌలింగ్‌లో షేక్ రషీద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
కెప్టెన్ దునిత్ వెల్లలాగే 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి విక్కీ వత్సల్ బౌలింగ్‌లో రాజ్ భవకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన రనుడా సోమరత్నే కూడా అవుట్ కావడంతో 57 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయింది శ్రీలంక...
26.3 ఓవర్లు ముగిసే సమయానికి 57 పరుగులకి 7 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. ఆ తర్వాత 39 బంతుల్లో 17 పరుగులు జోడించి లంకను ఆదుకునే ప్రయత్నం చేశారు రవీన్ డీ సిల్వ, యషిరు రొడ్రిగో... 8వ వికెట్‌కి 25 పరుగులు జోడించిన తర్వాత రవీన్ డీ సిల్వ అవుట్ అయ్యాడు.
29 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసి రవీన్ డీ సిల్వను షేక్ రషీద్ రనౌట్ చేయగా వర్షం బ్రేక్ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత దూకుడుగా ఆడిన యషిరు రొడ్రిగో 26 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేయగా, మతీశ పతిరణ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.
భారత బౌలర్లలో విక్కీ వత్సల్ 8 ఓవర్లలో 3 మెయిడిన్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, కుశాల్ తంబే 6 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రవి కుమార్, రాజ్ భవ తలా ఓ వికెట్ తీశారు.
పాకిస్తాన్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 147 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక జట్టు, అద్భుత బౌలింగ్‌తో పాకిస్తాన్ జట్టును 125 పరుగులకు ఆలౌట్ చేసి 22 పరుగుల తేడాతో అద్బుత విజయాన్ని అందుకుంది.
