సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్.. ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. 37 ఏళ్ల స్టెయిన్, గత ఏడాది ఐపీఎల్‌లో లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. స్టెయిన్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ ఆశలు పెట్టుకున్నా, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌కి ఇంకా మూడు నెలల సమయం ఉండగానే 2021 సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు డేల్ స్టెయిన్. ‘ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి అందుబాటులో ఉండకూడదని నాకు నేనుగా నిర్ణయించుకుననా. వేరే జట్టుకి ఆడాలని కూడా అనుకోవడం లేదు.

ఈ సమయంలో కొంత బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నా... అర్థం చేసుకున్నందుకు ఆర్‌సీబీ ధన్యవాదాలు... లేదు... నేను రిటైర్ కాలేదు’ అని చెప్పాడు డేల్ స్టెయిన్. తాను వేరే లీగ్‌ల్లో పాల్గొనబోతున్నట్టు, క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశాడు స్టెయిన్.

స్టెయిన్ ట్వీట్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిప్లై ఇచ్చింది. ‘నిన్ను మిస్ అవుతాం... డేల్ స్టెయిన్. థ్యాంకూ ఫర్ మెమొరీస్...’ అంటూ కామెంట్ చేసింది ఆర్‌సీబీ.