స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2020 లో ప్లేఆఫ్ కు చేరే అవకాశాన్ని చేజేతులా కోల్పోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. సునాయాసంగా ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశం వివిధ కారణాల వల్ల చేజారినా తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కూడా  ఆదివారం ఓటమిని చవిచూసిన పంజాబ్ జట్టుకు పూర్తిగా తలుపులు మూసుకుపోయాయి. చెన్నై జట్టు ఈ టోర్నీ నుండి నిష్క్రమిస్తూ తమవెంట పంజాబ్ ను తీసుకెళ్ళింది. 

చెన్నైతో మ్యాచ్ కు ముందే పంజాబ్ చాలా మంచి అవకాశాలను చేజార్చుకుంది. ఓ గెలుపయితే కేవలం అంపైర్ తప్పిదం వల్లే మిస్సయ్యింది. ఇలా కర్ణుడు చావుకు అనేక కారణాలన్నట్లు పంజాబ్ పరజాయాలకు కూడా కారణాలు అనేకమున్నాయి. కానీ ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న ఓ మూడు మ్యాచుల్లో ఓటమిపాలవడం రాహుల్ సేన ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీశాయి. 

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ విజయాన్న అందుకున్నట్లు అందుకుని జారవిడిచింది. చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు చేయలేక పంజాబ్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేయడంతో సూపర్ ఓవర్‌  దాకా తెచ్చుకున్న పంజాబ్ ఆ ఓవర్లోనూ ఓటమిపాలయ్యింది. అయితే అంతకు ముందు అంపైర్ చేసిన తప్పిదం కూడా ఆ జట్టు ఓటమికి కారణమయ్యింది. 

ఈ మ్యాచ్ లో రబాడ వేసిన 18వ ఓవర్లో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ రెండు పరుగులు తీశాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని క్రిస్‌ జోర్డాన్‌ రెండో పరుగు సమయంలో బ్యాట్‌‌ను సరిగా క్రీజ్‌లో ఉంచలేదనే కారణంతో అంపైర్‌ నితిన్‌ మీనన్ ఒక పరుగు కోత పెట్టాడు‌. కానీ బ్యాట్ క్రీజ్‌ లోపలే పెట్టినట్లు ఆ తర్వాత రిప్లేలో స్పష్టంగా కనిపించింది. ఈ ఒక్కపరుగు పంజాబ్ ఖాతాలో చేరివుంటే విజయం పంజాబ్ సొంతమయ్యేది.   

అలాగే మరికొన్ని మ్యాచుల్లోనూ చేజేతులా విజయావకాశాలను చేజార్చుకుంది పంజాబ్ జట్టు. కెప్టెన్ కెఎల్ రాహుల్ ఎంత పోరాటపటిమను ప్రదర్శించినా మిగతా ఆటగాళ్లు ఆ స్థాయిలో ఆడలేకపోవడంతో పాటు చిన్న చిన్న తప్పులే ఆ జట్టును చివరకు లీగ్ దశనుండే  వెనుతిరిగేలా చేశాయి.