క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఓ అంపైర్ గుండెపోటుకు గురై మరణించారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా లాయర్స్ టోర్నమెంట్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం టీఎంసీ గ్రౌండ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు నసీమ్ షేక్ అంపైర్‌గా వ్యవహరించారు.

మ్యాచ్ జరుగుతుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆటగాళ్లు, నిర్వహకులు ఆయనను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే నసీమ్ తుదిశ్వాస విడిచారు.

కరాచీలో చిరు వ్యాపారం చేసుకునే నసీమ్‌కు క్రికెట్ అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే అర్హత కలిగిన అంపైర్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనకు గతంలోనే ఆంజియోగ్రామ్ జరగ్గా.. సోమవారం మళ్లీ గుండెపోటు రావడంతో నసీమ్ మరణించినట్లుగా తెలుస్తోంది.