ఐపిఎల్ సీజన్ 12లో బెంగళూరు వేదికగా స్థానిక రాయల్ చాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ల ఇటీవలే ఆసక్తికరమైన మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చిన్న స్వామి స్టేడియంలో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడిన ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా పోరాడాయి. తమ ప్లేఆఫ్  అవకాశాలను మెరుగుపర్చుకోడానికి  సన్ రైజర్స్, సొంత ప్రేక్షకులను చివరి  మ్యాచ్ ద్వారా  అలరించాలనుకున్న ఆర్సిబి  గెలపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇలాంటి కీలక మ్యాచ్ లో అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని  ప్రకటించడంతో  ఆర్సిబి కెప్టెన్ అతడతో వాగ్వివాదానికి దిగాడు. ఇలా అప్పటికప్పుడు సమసిపోయిన ఈ  వివాదం ఇప్పుడు చిలికిచిలికి గాలివానగా మారీ ఆ అంపైర్ భారీ మూల్యాన్ని చెల్లించుకునే స్థాయికి చేరింది. 

తనతో ఆటగాళ్లు వాగ్వాదానికి దిగడంతో కోపంతో ఊగిపోయిన లాంగ్ విపరీతంగా ప్రవర్తించాడు. స్టేడియంలోని  ఓ గది తలుపును కోపంగా తన్నడంతో అదికాస్తా విరిగిపోయింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న స్టేడియం అధికారులు అంపైర్ పై బిసిసిఐకి ఫిర్యాదు చేశారు. సీఓఏ విచారణలో గనుక లాంగ్ తప్పుచేసినట్లు  తేలితే కఠినంగా వ్యవహరించే అవకాశం వుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌ కు లాంగ్ అంఫైరింగ్ చేయాల్సి వుంది. అప్పటివరకు బీసీసీఐ చర్యలు తీసుకుంటే... ఈ మ్యాచ్‌‌కి లాంగ్ దూరమయ్యే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.  

ఏం జరిగిందంటే: 

చిన్న స్వామి స్టేడియంలో గత శనివారం ఆర్సిబి,సన్ రైజర్స్ లు తలపనడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ బ్యాట్ మెన్స్ ను ఆర్సిబి  బౌలర్లు తక్కువ పరుగులకే అడ్డేకోవడంలో సఫలమయ్యారు. అయితే ఉమేశ్ యాదవ్  వేసిన చివరి ఓవర్లో కెప్టెన్ విలియమ్సన్ చెలరేగాడు. వరుస బంతుల్లో సిక్సులు, ఫోర్లతో చెలరేగుతున్న సమయంలో అంఫైర్ నిగెల్ లాంగ్ ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో ఉమేశ్ వేసిన ఓ బంతిని నోబాల్ గా ప్రకటించి సన్ రైజర్స్ కు ఫ్రీ హిట్ ఇచ్చాడు. దీంతో ఉమేశ్ యాదవ్ తో పాటు కెప్టెన్ కోహ్లీ ఆ  నిర్ణయం గురించి అంఫైర్ ను ప్రశ్నించారు.  అయితే వారిన  లాంగ్ కోపంగా కసురుకోవడం స్పష్టంగా కనిపించింది. 

అయితే రిప్లేలో మాత్రం ఆ  ఉమేశ్ సక్రమంగానే బాల్ వేసినట్లు తేలింది. అయినా అంఫైర్ నిర్ణయాన్ని మార్చుకోకపోగా కోపాన్నిమరింత పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫీల్డ్ లోంచి  బయటకు వచ్చాక అనుచితంగా ప్రవర్తించాడు.  దీంతో స్టేడియం అధికారులు బిసిసిఐ కి ఫిర్యాదు చేశారు.