Asianet News TeluguAsianet News Telugu

నేపాల్‌కి నిరాశ... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి యూఏఈ, ఐర్లాండ్ అర్హత...

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ సెమీ ఫైనల్స్‌లో ఓమన్‌ను ఓడించిన ఐర్లాండ్... నేపాల్‌ను ఓడించి యూఏఈ...

UAE and Ireland Qualified for ICC Men's T20 World cup 2022, Nepal failed to qualify
Author
India, First Published Feb 22, 2022, 8:27 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడాలన్న నేపాల్ ఆశలు నెరవేరలేదు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ పోటీల్లో ఓమన్‌ను ఓడించి ఐర్లాండ్, నేపాల్‌ను ఓడించి యూఏఈ అర్హత సాధించాయి...

గ్రూప్ స్టేజ్‌లో నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు యూఏఈ, ఐర్లాండ్ జట్లు పోటీపడబోతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ నెలలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది...

ఓమన్‌తో జరిగిన సెమీ ఫైనల్ 2లో ఐర్లాండ్ జట్టు 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 

గారెత్ డెలనీ 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేయగా హారీ టెక్టర్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.. ఆండీ మెక్‌బ్రెయిన్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

లక్ష్యఛేదనలో ఓమన్ జట్టు 18.3 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షోయబ్ ఖాన్ 22 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేయగా కెప్టెన్ జీశన్ మక్సూద్ 28 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో సిమి సింగ్ 3 వికెట్లు తీయగా జోషువా లిటిల్, క్రెగ్ యంగ్, అండీ మెక్‌బ్రెయిన్ రెండేసి వికెట్లు పడగొట్టారు...

గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకున్న నేపాల్ జట్టు, సెమీ ఫైనల్‌లో మాత్రం ఆ ఆటతీరును చూపించలేకపోయింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో ఓడింది నేపాల్...

తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ వసీం 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, వికెట్ కీపర్ వ్రిత్య అరవింద్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు...

లక్ష్యఛేదనలో నేపాల్ జట్టు 18.4 ఓవర్లలో 107 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దిపేంద్ర సింగ్ అయిరే 38 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేయగా కెప్టెన్ సందీప్ లామిచానే 4 పరుగులు చేసి నిరాశ పరిచాడు. అరిఫ్ షేక్ 11, జ్ఞానేంద్ర మల్ల 16 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు...
 
యూఏఈ కెప్టెన్ అహ్మద్ రజా 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 19 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి నేపాల్ పతనాన్ని శాసించాడు. గ్రూప్ స్టేజ్‌లో నమీబియా స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, యూఏఈ, ఐర్లాండ్ జట్లు పోటీపడతాయి. రెండు గ్రూపుల్లో టాప్‌ 2లో నిలిచిన జట్టు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 12 స్టేజ్‌కి నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios