Asianet News TeluguAsianet News Telugu

Asia Cup U-19: హర్నూర్ సింగ్ సెంచరీ.. ఆసియా కప్ లో టీమిండియా కుర్రాళ్ల బోణీ..

Asian Cricket Council Under-19 Asia Cup: ఆసియా కప్ లో  యువ భారత్ బోణీ కొట్టింది.  దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో  అండర్-19 భారత కుర్రాళ్లు.. యూఏఈని చిత్తుచిత్తుగా ఓడించారు.

U19 Asia Cup 2021-22: India Under 19 Team Beats UAE U-19 by 154 Runs In Tournament opener
Author
Hyderabad, First Published Dec 23, 2021, 6:10 PM IST

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్-19 ఆసియా కప్ ను భారత యువ జట్టు విజయంతో ఆరంభించింది. దుబాయ్ వేదికగా నేటి నుంచి మొదలైన ఈ టోర్నీలో భారత జట్టు.. తమ తొలి  మ్యాచులో యూఏఈని  చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు హర్నూర్ సింగ్,  కెప్టెన్ యశ్ ధుల్   భారీ స్కోర్లు అందించారు.  హర్నూర్ సింగ్ (120) సెంచరీ బాదగా.. యశ్ ధుల్ (63) సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రాజవర్ధన్ ధాటిగా ఆడటంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో యూఏఈ 128 పరుగులకే చాప చుట్టేసింది. ఫలితంగా టీమిండియా.. 154 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

టాస్ గెలిచిన యూఏఈ.. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్ రఘువంశీ (2) త్వరగానే ఔట్ అయినా మరో ఓపెనర్  హర్నూర్ సింగ్ మాత్రం (130 బంతుల్లో 11 ఫోర్లతో 120) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.  అతడికి వన్ డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (35), కెప్టెన్ యశ్ ధుల్ (63) సహకరించారు. ఆఖర్లో  రాజవర్ధన్ (23 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 నాటౌట్) రాణించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో ఏకంగా 9 మంది బౌలింగ్  చేయడం గమనార్హం.  ఇంతమంది బౌలింగ్ చేసినా.. కెప్టెన్ అలిషాన్ షరఫు మాత్రమే రెండు  వికెట్లు దక్కించుకున్నాడు. 

 

లక్ష్య ఛేదనలో యూఏఈ ఎక్కడ కూడా గెలుపు కోసం ఆడినట్టు కనిపించలేదు. ఓపెనర్ కై స్మిత్ (70 బంతుల్లో 45) మాత్రమే రాణించాడు.  ఛేదనలో ఆ జట్టు  38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక అప్పట్నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడుతూనే ఉన్నాయి. ధృవ్ పర్శర్ (19), అలిషాన్ షరఫు (13), సూర్య సతీష్ (21) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. తక్కినవారంతా అలా వచ్చి ఇలా వెళ్లారు. భారత బౌలర్ల ధాటికి ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. 

భారత బౌలర్లలో రాజవర్ధన్.. 9 ఓవర్లు వేసి 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా.. గర్వ్ సంగ్వన్ రెండు వికెట్లు పడగొట్టాడు. విక్కీ ఓస్వల్, కౌషల్ కూడా తలో రెండు వికెట్లు తీశారు.  భారత జట్టు ఈనెల 25న పాకిస్థాన్ ను ఢీకొనబోతున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios