అంతర్జాతీయ మహిళా క్రికెట్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వేరు వేరు దేశాల అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటివరకు ప్రేమ పక్షుల్లా విహరించిన ఈ లెస్బియన్ క్రికెట్ జంట ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పెళ్లికి సంబంధించిన ఫోటోను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 

న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సెన్, ఆస్ట్రేలియా క్రికెటర్ నికోలా హాన్‌కాక్‌ లు పెళ్లాడారు. గత వారమే వీరిద్దరి వివాహం వారి సాంప్రదాయాల ప్రకారం జరిగినట్లు నికోలా ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టు అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.  ‘ తన భాగస్వామి హెలే జెన్సెన్‌ను పెళ్లాడిన మా స్టార్‌ బౌలర్‌ హాన్‌కాక్‌కు టీమ్‌గ్రీన్‌ తరఫున శుభాకాంక్షలు’ అంటూ ఈ జంటకు సంబంధించి పెళ్ళి పోటోతో సహా షేర్‌ చేసింది.

 2014లో జెన్సెన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. కివీస్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా మంచి ప్రదర్శనను కనబర్చిన ఆమె.. 2015లో ఓ మ్యాచ్ లో 122 పరుగులు సాధించి ఉమెన్ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. ఇక  హాన్‌కాక్‌ మహిళా బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.