రాంచీ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అంతరాయం ఏర్పడింది. ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ ని కాసేపు నిలిపివేశారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ ని తాకేందుకు ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకువచ్చాడు. అభిమాని చర్యకు డీకాక్ కూడా కంగారుపడ్డాడు. భారత్ లో ఈ మ్యాచ్ జరుగుతుండగా.... ఇలా అభిమానుల చర్యలతో అంతరాయం ఏర్పడటం ఇది మూడోసారి.

వైజాగ్ టెస్టు మ్యాచ్ లో ఓ అభిమాని విరాట్ కోహ్లీ వద్దకు సెల్ఫీకోసం పరిగెత్తుకు వచ్చాడు. పూణే టెస్టులో రోహిత్ శర్మ పాదాన్ని తాకేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు. ఆ అభిమాని చర్యతో రోహిత్ కింద పడిపోయాడు కూడా. ఇప్పుడు ఈ పరిస్థితి డికాక్ కి ఎదురైంది.

రాంచీ టెస్టులో బ్యాక్ వర్డ్ పాయింట్ లో డికాక్ ఫీల్డింగ్ చేస్తుండగా.. వెనక నుంచి సడన్ గా వచ్చిన అభిమాని అతని పాదాలపై పడిపోయాడు. దీంతో కంగారుపడిన డీకాక్ పక్కకి తప్పుకున్నాడు.  అప్పటికే అప్రమత్తమైన సిబ్బంది అభిమాని వెంట పరుగెత్తుకుంటూ వచ్చి... అతనిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి చెప్పు అక్కడే పడిపోయింది.

అయితే... ఆ సమయంలో డీకాక్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. తనను అభిమాని ఇబ్బంది పెట్టినా కోపం తెచ్చుకోకుండా... పొరపాటున మైదానంలో పడిపోయిన అభిమాని చెప్పును తిరిగి ఇవ్వడం విశేషం. సదరు అభిమానిని సెక్యురిటీ సిబ్బంది తీసుకువెళ్తున్నప్పుడు అతని చెప్పు జారి పడిపోయింది. దీంతో అతని చెప్పును డీకాక్ బౌండరీ వద్దకు తీసుకువెళ్లి... మైదానం వెలుపలికి విసిరాడు. 

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా... డీకాక్ చేసిన పనికి నెటిజన్లు స్పందన అద్భుతంగా ఉంది. ధోనీ, విరాట్ , రోహిత్ లను కాదని దక్షిణాఫ్రికా క్రికెటర్ కోసం అభిమాని వచ్చాడా అంటూ పలువరు ట్వీట్లు చేస్తున్నారు. ఇది డీకాక్ జీవితంలో చాలా ఎమోషనల్ సంఘటన అంట ట్వీట్ చేస్తున్నారు.