The Ashes 2021-22: ఇంగ్లాండ్ సారథి జో రూట్ కు గాయమై నొప్పితో విలవిల్లాడుతుంటే మరోవైపు  ఆసీస్ కామెంటేటర్లు మాత్రం దానిని చూస్తూ పగలబడి నవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

యాషెస్ రెండో టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా కామెంటేటర్లు చేసిన పనికి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ సారథి జో రూట్ కు గాయమై అతడు నొప్పితో బాధపడుతుంటే.. మరోవైపు కామెంటరీ బాక్స్ లో ఉన్న ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ తో పాటు ఇతర కామెంటేటర్లు ఇకఇకలు పకపకలాడటం చూసిన నెటిజనులు వాళ్లపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘నొప్పితో బాధపడుతూ కూడా రూట్ పోరాడుతుంటే.. మీకు నవ్వెలా వస్తుంది..? అంటూ వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో భాగంగా ఆసీస్ పేసర్ మిచెల్ ప్టార్క్ వేసిన బంతి రూట్ కడుపు కింది భాగంలో బలంగా తాకింది. ఆ సమయంలో అతడు తీవ్రంగా నొప్పితో బాధపడ్డాడు. ఒకవైపు నొప్పి వేధిస్తున్నా.. దానిని దిగమింగుతూ రూట్ బ్యాటింగ్ చేశాడు.

Scroll to load tweet…

ఇదే క్రమంలో వికెట్ల మధ్య పరిగెత్తేప్పుడు రూట్ ఇబ్బందిగా కనిపించాడు. నొప్పి కారణంగా అతడు నెమ్మదిగా..ఎప్పటిలాగా కాకుండా కాళ్లు దూరంగా పెట్టి పరిగెత్తాడు. ఇది చూసి కామెంట్రీ బాక్స్ లో ఉన్న రికీ పాంటింగ్ తో పాటు మరికొందరు ఆసీస్ కామెంటేటర్లు పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. 

దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘బాల్ అతడికి బలంగా తాకినా నొప్పిని తట్టుకుని మరీ రూట్ పోరాడుతున్నాడు. కానీ ఈ క్రికెట్ పండితులేమో దానిని చూసి జోక్స్ వేసుకుంటున్నారు..’ అని కామెంట్ చేశాడు. ‘అవునా.. ఇందులో జోక్ ఏముంది అంత నవ్వడానికి..? నొప్పి కారణంగా అతడు సరిగా పరిగెత్తలేకపోతున్నాడు. ఇది నవ్వాల్సిన సందర్భమా..?’ అంటూ మరో యూజర్ ఫైర్ అయ్యాడు. ‘అందులో నవ్వడానికి ఏముంది..? ఆస్ట్రేలియన్లకు పిచ్చి పట్టినట్టుంది..’అని మరో ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

‘ఆటలో గాయాలు సహజం. అందులో నవ్వడానికి ఏమీ లేదు..’, ‘రూట్ కు దెబ్బ తగిలి 5 నిమిషాల దాకా కోలుకోలేదు. అయినా కూడా అతడు పోరాటం ఆపలేదు. వీలైతే అతడి మీద గౌరవం చూపండి.. జోక్స్ కాదు..’ అంటూ పలువురు ట్విట్టర్ యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 275 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 468 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు.. 192 పరుగులకే చేతులెత్తేసింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్ 207 బంతులాడి ఆ జట్టును ఓటమి నుంచి తప్పించాలని చూసినా హిట్ వికెట్ గా ఔటవ్వడంతో ఇంగ్లాండ్ కు భంగపాటు తప్పలేదు. ఇక గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్ విజేతను తేల్చే కీలకమైన మూడో టెస్టు.. ఈనెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా మొదలుకానున్నది.