Women's T20 Challenge 2022: ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లో భాగంగా మహారాష్ట్రలోని పూణెలో జరుగుతున్న వెలోసిటీ-ట్రయల్ బ్లేజర్స్ మధ్య జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన స్మృతి మంధాన సారథ్యలోని ట్రయల్ బ్లేజర్స్ భారీ స్కోరు చేసింది.
మహిళల టీ20 ఛాలెంజ్ లో భాగంగా వెలోసిటీ-ట్రయల్ బ్లేజర్స్ మధ్య జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ట్రయల్ బ్లేజర్స్ దుమ్ము దులిపింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కు చెందిన అమ్మాయి సబ్భినేని మేఘన (47 బంతుల్లో 73.. 7 ఫోర్లు, 4 సిక్సర్లు) జెమీమా రొడ్రిగ్స్ (44 బంతుల్లో 66.. 7 ఫోర్లు, 1 సిక్సర్) లు ధాటిగా ఆడారు. ఫలితంగా ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లో ఇదే అత్యధిక స్కోరు. కాగా వెలోసిటీ విజయం సాధించాలంటే 120 బంతుల్లో 191 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. 158 పరుగుల లోపు వెలోసిటీని కట్టడి చేయగలిగితే ట్రయల్ బ్లేజర్స్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మంధాన ఒక్క పరుగుకే వెనుదిరిగింది. వన్ డౌన్ గా వచ్చిన జెమీమా తో కలిసి మేఘన ఆకాశమే హద్దుగా చెలరేగింది.
తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదిన మేఘన.. మూడో ఓవర్లో పాయింట్స్ లో క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఆమె రెండు చేతులా సద్వినియోగం చేసుకుంది. ఇద్దరూ కలిసి ఫోర్లతో విజృంభించారు. ఓవర్ కు ఓ ఫోర్ కు తగ్గకుండా.. రన్ రేట్ పడిపోకుండా ఆడారు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మేఘన ఆ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడింది. మరో ఎండ్ లో రొడ్రిగ్స్ కూడా దూకుడు కొనసాగించడంతో ట్రయల్ బ్లేజర్స్ స్కోరు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది.
69 బంతుల్లోనే వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్న తర్వాత మేఘన.. స్నేహ్ రాణా బౌలింగ్ లో కేట్ క్రాస్ కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. అయితే అప్పటికే 15 ఓవర్లు ముగిసేసరికి ట్రయల్ బ్లేజర్స్.. 128-2 పటిష్టస్థితిలో నిలిచింది. అదే క్రమంలో రొడ్రిగ్స్ కూడా హాఫ్ సెంచరీ సాధించింది.
మేఘన స్థానంలో వచ్చిన హేలే మాథ్యూస్ (16 బంతుల్లో 27.. 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడింది. అయబొంగ ఖాఖ వేసిన 17వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టింది. అదే ఓవర్లో ఆఖరి బంతికి రొడ్రిగ్స్ భారీ షాట్ ఆడబోయి స్నేహ్ రాణాకు క్యాచ్ ఇచ్చి ఔటైంది.
ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన సోఫియా డంక్లీ (8 బంతుల్లో 19.. 2 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా మాథ్యూస్.. ట్రయల్ బ్లేజర్స్ కు భారీ స్కోరు అందించింది. చివర్లో వీళ్లిద్దరూ ఔటయ్యారు. వెలోసిటీ బౌలర్లలో సిమ్రాన్ బహదూర్ కు రెండు వికెట్లు దక్కగా.. స్నేహ్ రాణా, కేట్ క్రాస్ చెరో వికెట్ తీశారు.
