Independence Day 2022: గత కొద్దికాలంగా క్రీడారంగాంలో అద్భుతాలు సృష్టిస్తున్న భారత్ విజయాల వెనుక ఉన్న రహస్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన స్వతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వెల్లడించారు.
ఒలింపిక్స్‌కు వెళ్తే ఒకటి, రెండు పతకాలు. వంద కోట్లకు పైగా ఉన్న జనాభాలో ఆ పతకాలను చూసి గర్వపడాలో, బాధపడాలో అర్థం కాని స్థితి. విశ్వ క్రీడలను వదిలేసినా.. ప్రపంచ ఛాంపియన్షిప్స్‌లో కూడా అదే పరిస్థితి. పతకాల సంగతి పక్కనబెడితే కనీసం క్వాలిఫై అయితేనే గొప్ప అనే దుస్థితికి దిగజారిన మన క్రీడారంగం గత కొన్నాళ్లుగా అద్భుతాలు సృష్టిస్తున్నది. టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలు గెలుచుకున్న భారత్.. ఇటీవలే ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ -2022లో 61 పతకాలతో టాప్-4లో నిలిచింది. అయితే ఈ విజయాల వెనుక గల కారణాలను తాజాగా ప్రధాని మోడీ వివరించారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట మీద చేసిన ప్రసంగంలో మోడీ మాట్లాడుతూ... దేశంలో రాజకీయాలతో పాటు క్రీడా రంగంలో వారసత్వం, బంధుప్రీతి కారణంగా ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకత లోపించిందని అన్నారు. అదే ఇన్నాళ్లు క్రీడలలో భారత్‌ను వెనక్కినెట్టిందని చెప్పారు.
మోడీ మాట్లాడుతూ.. ‘దేశంలో బంధుప్రీతి కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. అది క్రీడారంగానికి పాకింది. దీంతో ఆటగాళ్ల ఎంపికలో తమకు సంబంధించినవారినే ఎంపిక చేశారే తప్ప ప్రతిభావంతులను ఎంపిక చేయలేదు. ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకత లోపించింది. ఈ కారణంగా దేశంలో చాలా మంది క్రీడాకారుల ప్రతిభ వృథా అయింది. వాళ్లు జీవితాంతం ఇలాంటి కష్టాలకు వ్యతిరేకంగా పోరాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్రీడాకారులకు అవకాశాలు దక్కుతున్నాయి... వారి ప్రతిభ వెలుగులోకి వస్తున్నది. వారంతా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యమైన టోర్నీలలో మన ఆటగాళ్లకు బంగారు, రజత పతకాలు రావడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది..’ అని అన్నారు.
అయితే ఇది ప్రారంభం మాత్రమే అని.. ఇక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదని మోడీ తెలిపారు. ‘ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఇది పాత దేశ కాదు. అలిసిపోకండి. ఎక్కడా ఆగిపోకండి. మనం అనేక పతకాలు సాధించే రోజులు ఎంతో దూరంలో లేవు..’ అని మోడీ ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు.
గతేడాది టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పతకాలు సాధించింది. ఇటీవలే బర్మింగ్‌హామ్ లో ముగిసిన కామన్వెల్త్ క్రీడలలో ఏకంగా 61 పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
భారీ టోర్నీలకు ముందు క్రీడాకారులను కలవడం, వారితో ముచ్చటించి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంటారు మోడీ. టోక్యో ఒలింపిక్స్ తో పాటు కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఆయన ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సందర్బంగా మోడీ.. రాజకీయాలతో పాటు క్రీడా వ్యవస్థలలో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయని, వాటిని సమూలంగా రూపుమాపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బంధుప్రీతి కారణంగా అసలైన క్రీడాకారుల ప్రతిభ కనుమరుగవుతుందని, దానిని అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత ఎంతో ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.
