Asianet News TeluguAsianet News Telugu

Tim David: మా దేవుడు నువ్వెనయ్యా మాకోసం వచ్చావయ్యా.. డేవిడ్ ను ఆకాశానికెత్తుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్

IPL 2022 Play Offs: ముంబై-ఢిల్లీ మ్యాచ్ లో  క్యాపిటల్స్ వైపు మొగ్గు ఉన్నా ఆఖర్లో వచ్చి ఆడింది తక్కువ బంతులే అయినా ఏదో పూనకం వచ్చినోడిలా ఆడి  ముంబైకి విజయాన్ని అందించాడు  టిమ్ డేవిడ్.. కాదు కాదు ఆర్సీబీని ప్లేఆఫ్స్ చేర్చాడు. 

Tim David receives Special Gift From RCB After His Heroics During MI vs DC Game
Author
India, First Published May 22, 2022, 1:29 PM IST

ఐపీఎల్-15 లో భాగంగా  శనివారం ముంబై-ఢిల్లీ ల మధ్య ముగిసిన 69వ లీగ్ మ్యాచ్ లో ముంబై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం వల్ల లీగ్ లో ముంబైకి కొత్తగా వచ్చేదేమీ లేకున్నా.. ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. ఈ  రెండు జట్లను పక్కనబెడితే ముంబై-ఢిల్లీ మ్యాచ్ ద్వారా లబ్ది పొందిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ముంబై నుంచి చేజారిపోతున్న మ్యాచ్ ను దగ్గరుండి గెలిపించిన టిమ్ డేవిడ్ ఇప్పుడు ఆర్సీబీ అభిమానుల పాలిట దేవుడయ్యాడు. అతడాడిన ఆ 11 బంతులు వాళ్ల కళ్లముందు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. 

ఆర్సీబీని ప్లేఆఫ్స్  కు చేర్చినందుకు గాను ఆ జట్టు సారథి డుప్లెసిస్ తో పాటు విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్ లు టిమ్ డేవిడ్ కు అరుదైన బహుమతి పంపారు. ఈ ముగ్గురు కలిసి  ముంబై కిట్ ధరించిన ఫోటోను డేవిడ్ కు కానుకగా పంపింది ఆర్సీబీ. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

శనివారం నాటి మ్యాచ్ అనంతరం డేవిడ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఉదయం నాకు ఫాఫ్ (డుప్లెసిస్) నుంచి మెసేజ్ వచ్చింది. అది అతడు, కోహ్లి, మ్యాక్స్వెల్ లు ముంబై కిట్ లో ఉన్న ఫోటో. ఆ ఫోటోను నేను త్వరలోనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను.’ అని తెలిపాడు. 

 

కాగా.. ఈ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం వల్ల బతికిపోయిన డేవిడ్.. పంత్ డీఆర్ఎస్ తీసుకుని ఉంటే డకౌట్ అయ్యేవాడు. కానీ పంత్ డీఆర్ఎస్ తీసుకోకపోవడంతో బతికిపోయాడు. ఆ తర్వాత 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో  విధ్వంసం (34) సృష్టించి ఢిల్లీ పతనాన్ని శాసించాడు.  డేవిడ్  దంచడంతో ముంబై విజయం సాఫీగా సాగింది. తద్వారా ఢిల్లీ ఐదో స్థానానికి ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాయి.  అయితే తన ఔట్ విషయంలో పంత్ డీఆర్ఎస్ తీసుకోకపోవడంపై డేవిడ్ స్పందిస్తూ.. ‘నాకు కొంచెం సౌండ్ వినపడింది. కానీ అది బ్యాట్ కు తాకిందో లేదో నాకు కూడా స్పష్టంగా తెలియదు. ఇక వాళ్లు రివ్యూ తీసుకోకపోవడం నా చేతుల్లో లేదు. అయితే ఆ సమయంలోనే నేను హిట్టింగ్ దిగాలని నేననుకోలేదు. కానీ అది అలా జరిగిపోయింది..’ అని చెప్పుకొచ్చాడు.  

 

నిన్నటి మ్యాచ్ లో పంత్ రివ్యూ కోరి ఉంటే  మ్యాచ్ ఫలితం తప్పకుండా  మరో విధంగా ఉండేది. వరుసగా రెండు వికెట్లు పడ్డ ఒత్తిడితో కచ్చితంగా ముంబై ఆట మారేది. ఆర్సీబీ అభిమానులు ఇప్పటికే  తమ జట్టు వైఫల్యాలను నెమరువేసుకుంటూ ఉండేవాళ్లు. ఢిల్లీ ప్లేఆఫ్స్ కు రెడీ అవుతూ ఉండేది. ఇవన్నీ జరుగలేదు. కానీ టిమ్ డేవిడ్ మాత్రం హీరో అయ్యాడు. అన్నట్టు.. డేవిడ్ కూడా గత సీజన్ లో  ఆర్సీబీ తరఫున ఆడిన వాడే కావడం గమనార్హం. 2021 లో ఐపీఎల్ లో రెండో దశలో సీఎస్కే మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అతడు.. ఈ ఏడాది ముంబైకి మారాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios