కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అందరూ కూడా ఇండ్లకే పరిమితమయ్యారు. భారత క్రికెటర్లు కూడా మ్యాచులు లేక ఇండ్లలోనే ఉంటూ అభిమానులతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 

తాజాగా టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ షమీ తన జీవితంలో తానెదుర్కున్న అత్యంత భయంకరమైన గడ్డు పరిస్థితుల గురించి వెల్లడించాడు. తాను మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్టు మొహమ్మద్ షమీ ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ లో రోహిత్ శర్మతో తన చేదు జ్ఞాపకాలను పంచుకున్నాడు. 

2015 వరల్డ్ కప్ లో గాయం తరువాత తాను మైదానంలోకి అడుగు పెట్టడానికి దాదాపుగా 18 నెలల సమయం పట్టిందని, ఆ కాలంలో తాను చాలా ఒత్తిడికి గురయ్యానని అన్నాడు మొహమ్మద్ షమీ. 

అలా మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా తాను వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందులను, వాటివల్ల ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చాడు. 2018లో షమీ మాజీ భార్య ఇష్రత్ జహాన్ అతనిపై గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే. 

ప్రపంచ కప్ గాయం, ఆతరువాత పర్సనల్ గా ఎదురైన ఇబ్బందులు, ఈ నేపథ్యంలో తాను మానసికంగా చాలా కృంగిపోయానని, మూడు సార్లు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. 

ఆ సమయంలో కుటుంబం తోడుండబట్టి తాను ఆ పరిస్థితుల నుంచి బయటపడిగలిగానని, కుటుంబ సభ్యుల మద్దతే లేకపోతే తానేమైపోయేవాడినో ఊహించుకోవడమే కష్టంగా ఉందని ఈ సందర్భంగా షమీ అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు. 

తనకు తోడుగా తన కుటుంబం ఎల్లవేళలా ఆ కాలంలో తన పక్కన నిలిచారని చెప్పుకొచ్చారు. తాను మానసికంగా ధృడంగా లేనన్న విషయం అర్థమైన తరువాత 24 గంటల పాటు తనను కంటికి రెప్పలా కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు తన పక్కన ఉండేవారని షమీ అన్నాడు. 

కుటుంబం తోడుగా ఉండడం అనేది చాలా గొప్పవిషయమని, ఎవరికైనా కుటుంబ సభ్యుల మద్దతు అనేది చాలా కీలకం అని అన్నారు. కుటుంబం గనుక తోడుంటే.... మనం ఏ పరిస్థితుల్లో ఉన్న కూడా బయటపడగలుగుతామని అభిప్రాయపడ్డాడు షమీ.