మహిళా క్రికెట్ టెస్టు చరిత్రలో ఇదో రికార్డు.. ఇంగ్లాండ్ ను 347 పరుగులతో తేడాతో ఓడించిన టీమ్ ఇండియా
IND w Vs ENG w: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర నెలకొల్పింది. ఇంగ్లాండ్ (England)తో శనివారం జరిగిన మహిళల ఏకైక టెస్టులో భారత్ (India) 347 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 347 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 428 పరుగుల భారీ స్కోరు చేసి ఇంగ్లాండ్ ను 136 పరుగులకే కట్టడి చేసింది. ఫాలోఆన్ ను అమలు చేయకుండా మళ్లీ బ్యాటింగ్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ ను 6 వికెట్ల నష్టానికి 186 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అయితే మూడో రోజు తొలి సెషన్ లో ఇంగ్లాండ్ ను 131 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ రెండో ఇన్నింగ్స్ లో 4/32తో రాణించారు.
బ్రీఫ్ స్కోర్స్ : భారత్: 42 ఓవర్లలో 6 వికెట్లకు 428 & 186 డిక్లేర్డ్ ఇంగ్లాండ్ : 27.3 ఓవర్లలో 136 & 131 ఆలౌట్ (హీథర్ నైట్ 21; దీప్తి శర్మ 4/32, పూజా వస్త్రాకర్ (3/23) 347 పరుగుల తేడాతో విజయం సాధించారు.
కాగా.. మహిళల టెస్టు చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 1998లో కొలంబోలో పాకిస్థాన్ పై శ్రీలంక 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. 2014లో రెండు సార్లు ఎవే మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ ను ఓడించిన భారత్ కు స్వదేశంలో 15 టెస్టుల్లో ఇదే తొలి గెలుపు కాగా, వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న ఏకైక టెస్టుకు ముందు ఈ విజయం టీమ్ ఇండియాకు పెద్ద ఊపునిచ్చింది.