Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కు దొంగలు భారీ షాకిచ్చారు.
గత కొంతకాలంగా అస్థిర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్న పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు ఆకాశనంటుతున్నాయి. ఉప్పు, పప్పులు కొనేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో పాటు దేశంలో ప్రజల దగ్గర ఉన్న కొద్దిపాటి నగదు కూడా నిండుకుంటున్నది. ఈ నేపథ్యంలో దొంగల బెడద ఆ దేశ ప్రజలను మరింతగా వేధిస్తున్నది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి మహ్మద్ హఫీజ్ ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులంతో పాటు భారీ నగదును ఎత్తుకెళ్లారని తెలుస్తున్నది.
పలు పాకిస్తాన్ న్యూస్ ఛానెళ్లలో వస్తున్న కథనాల మేరకు మూడు రోజుల (సోమవారం) క్రితం హఫీజ్ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో హఫీజ్, అతడి భార్య ఇంట్లో లేరు. అదే అనువుగా భావించిన దొంగలు.. హఫీజ్ ఇంట్లో నుంచి 20 వేల డాలర్లు (సుమారు రూ. 16 లక్షలు) దొంగిలించుకువెళ్లారని పోలీసులు తెలిపారు.
సీసీ టీవీలలో ఇందుకు సంబంధించిన ఫుటేజీ ఏదీ నమోదు కాలేదు. దీంతో దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు వేట మొదలుపెట్టారు. హఫీజ్ మామ షాహిద్ ఇక్బాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన హఫీజ్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఈ లీగ్ లో హఫీజ్ క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. టెస్టుల నుంచి 2018లోనే తప్పుకున్న అతడు.. 2019లో వన్డే వరల్డ్ కప్ నుంచి ఆడటం లేదు. టెస్టుల నుంచి 2022లో తప్పుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ తరఫున 55 టెస్టులు ఆడిన హఫీజ్.. 3,652 పరుగులు చేశాడు. వన్డేలలో 6,614 రన్స్, టీ20లలో 2,514 రన్స్ చేశాడు. పీఎస్ఎల్ లో హఫీజ్.. 1,730 రన్స్ సాధించాడు.
