Gautam Gambhir Warning To KL Rahul: ఐపీఎల్ లో లక్నో  సూపర్ జెయింట్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ కు బ్యాటింగ్ పరంగా తిరుగులేని రికార్డు ఉన్న రాహుల్ సారథిగా మాత్రం గొప్పగా సాధించేమీ లేదు. ఈ నేపథ్యంలో లక్నోకు మెంటార్ గా ఉన్న గంభీర్... 

ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ కు ఆ జట్టు మెంటార్ గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సీజన్ ఆరంభానికి ముందే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ లో భాగా ఆడినంత మాత్రానా నువ్వు (కెఎల్ రాహుల్) భారత జట్టుకు కెప్టెన్ అవుతావనే భావనను వీడాలని హితబోధ చేశాడు. ఒక కెప్టెన్ అనేవాడు జట్టును నడిపించేవాడుగా ఉండాలని, రిస్క్ లు తీసుకోకుండా విజయాలు సాధ్యం కావని అతడికి సూచించాడు. ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వేళ రాహుల్ కు గంభీర్ కీలక సూచనలు చేశాడు. 

ఓ జాతీయ ఛానెల్ తో గంభీర్ మాట్లాడుతూ... ‘అంతిమంగా ఒక నాయకుడు జట్టుకు ఫ్లాగ్ బేరర్ (జెండా మోసేవ్యక్తి) వంటి వాడు. లక్నోకు రాహుల్ కూడా అలాంటి వాడే.. నాకు బ్యాటింగ్ చేసే కెప్టెన్ కెఎల్ రాహుల్ కంటే జట్టుకు కెప్టెన్ గా ఉండే బ్యాటర్ కెఎల్ రాహుల్ ఉండటం ముఖ్యం. మీకు తేడా అర్థమైందనుకుంటాను..’ అని అన్నాడు. 

రిస్క్ తీసుకోవాల్సిందే.. 

అంతేగాక.. రాహుల్ తన విధాన నిర్ణయాలలో నిర్భయంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు గంభీర్ చెప్పాడు. ‘ఏ కెప్టెన్ అయినా రిస్క్ తీసుకోవడం నేర్చుకోవాలి. రాహుల్ కూడా రిస్కులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు రిస్క్ లను స్వీకరించకుంటే మీరు విజయం సాధిస్తారా..? లేదా..? అనే విషయం మీకు తెలియదు. ఈసారి మాకు క్వింటన్ డికాక్ రూపంలో వికెట్ కీపర్ ఉన్నాడు. కాబట్టి రాహుల్ కు కీపింగ్ చేసే టెన్షన్ లేదు. అతడు స్వేచ్ఛగా రిలాక్స్డ్ గా ఉండొచ్చు. కీపింగ్ బాధ్యతలు లేనప్పుడు అతడు బ్యాటింగ్, నాయకత్వంపై దృష్టి సారించవచ్చు...’ అని తెలిపాడు. 

Scroll to load tweet…

ఐపీఎల్ లో ఆడినంత మాత్రానా... 

ఐపీఎల్ లో భాగా రాణించినంత మాత్రానా జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎంపికవుతావనే విషయమ్మీద నమ్మకం లేదని గంభీర్ సూచించాడు. ‘ఒక విషయం తెలుసుకో. భావి భారత కెప్టెన్ గా ఎదగడానికి భారత కెప్టెన్ గా నియమించబడటానికి చాలా తేడా ఉంది. ఐపీఎల్ అనేది ఒకరి స్వభావాన్ని వ్యక్తీకరించడానికి ఒక వేదిక మాత్రమే.. ఇందులో నాయకుడిగా ఎదగొచ్చు కానీ భారత కెప్టెన్ గా మారడానికి మాత్రం ఐపీఎల్ సాయపడుతుందని గ్యారెంటీ లేదు..’ అని గంభీర్ చెప్పాడు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇందుకు పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘విరాట్ కోహ్లి ఇప్పటికే భారత్ కు కెప్టెన్ గా చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ గాఉన్నాడు. అయితే తర్వాత ఐపీఎల్ సీజన్ లో భావి భారత కెప్టెన్ గా నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం. ప్రస్తుతం ఐపీఎల్ లో వివిధ జట్లకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లు భారత జట్టుకు భావి సారథులుగా కనబడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఐపీఎల్ సీజన్ భావి కెప్టెన్ ను తయారుచేసే ఓ వేదిక అని చెప్పకతప్పదు..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.