టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల భారత జట్టులో చోటు దక్కించుకుంటున్న యువ క్రికెటర్లను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రతి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటేనే జట్టులో స్థిరమైన స్థానాన్ని పొందగలరని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మరీ ఎక్కువగా అవకాశాలు ఆశించవద్దని...   అలా ఆశిస్తే ఎక్కువరోజులు కెరీర్ కొనసాగించలేరని కోహ్లీ సూచించాడు. 

''నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్ళలో ఎక్కువ అవకాశాలను ఆశించేవాడిని కాదు. అందివచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకునేవాడిని. దీంతో అతి తక్కువ మ్యాచుల్లోనే నన్ను నేను నిరూపించుకుని జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాను. నాలాగే ఇప్పటి యువ క్రికెటర్లు కూడా ఆలోచించాలి. 

ఐసిసి టీ20 ప్రపంచ కప్ కు మరో ఏడాది మాత్రమే సమయముంది. అప్పటివరకు దాదాపుగా  టీమిండియా మరో 30 మ్యాచ్ లకు మించి ఆడదు.  కాబట్టి జట్టులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్లు గరిష్టంగా నాలుగైదు మ్యాచుల్లోనే  తమను తాము ప్రూవ్ చేసుకోవాలి.  లేదంటే ఇతర ఆటగాళ్లను పరీక్షించాల్సి వుంటుంది. కాబట్టి జాగ్రత్తగా, పక్కా ప్రాక్టీస్, వ్యూహాలతో బరిలోకి దిగి  రాణించిన ఆటగాళ్లే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోగలరు.''అని కోహ్లీ పేర్కొన్నాడు. 

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సీరిస్ కోసం చాలామంది యువ క్రికెటర్లు జట్టులో సెలెక్టయ్యారు. వెస్టిండిస్ పర్యటనలో రాణించిన శ్రేయాస్ అయ్యర్ తో పాటు మనీష్ పాండేలకు సెలెక్టర్లు మరో అవకాశాన్నిచ్చారు. ఇక బౌలర్లలో నవదీప్ సైనీ, దీపక్ చాహర్,రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్ లు కూడా 15మంది ఆటగాళ్లలో చోటు దక్కించుకున్నారు.